Site icon NTV Telugu

Telangana: ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్‌లు విడుదల.. సిలబస్‌పై లేని స్పష్టత

తెలంగాణలో ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష.. జూలై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన చేసింది. ఎంసెట్ పరీక్ష కోసం దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు అయితే రూ.800.. ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.400 చెల్లించాల్సి ఉంది.

మరోవైపు ఈసెట్ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి జూన్ 8 వరకు అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 13న ఎంట్రన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్, డిప్లొమా, బీఎస్సీ మేథమేటిక్స్ చదివిన విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్‌ను నిర్వహిస్తారు. ఈసెట్ పరీక్ష కోసం జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలని ఈసెట్ కన్వీనర్ విజయ్ కుమార్ తెలిపారు.

కాగా ఎంసెట్‌ను ఏపీ, తెలంగాణలో 105 కేంద్రాల్లో నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్‌కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 2.5 లక్షల మంది దరఖాస్తు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,64 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కోసం 86,644 మంది దరఖాస్తు చేశారు. ఈ ఏడాది కూడా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రభుత్వం కనీస మార్కులతో పాస్ చేయడంతో భారీగానే దరఖాస్తులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఎంసెట్‌లో వెయిటేజ్, ఇంటర్‌లో మినిమం మార్క్స్, ఎంసెట్ సిలబస్‌పై అధికారికంగా ఇప్పటివరకు ఉత్తర్వులు వెలువడలేదు. వీటిపై క్లారిటీ లేకుండానే ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఈసారి కూడా ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ ఉండదని తెలుస్తోంది. ఇంటర్ పాస్ అయితే చాలు అని.. మొదటి, ద్వితీయ సంవత్సరం 70 శాతం సిలబస్ నుండే ప్రశ్నలు ఉంటాయని ఉన్నత విద్యా మండలి అధికారులు సూచిస్తున్నారు.

https://ntvtelugu.com/highest-power-consume-in-telangana-today/
Exit mobile version