Site icon NTV Telugu

Telangana: వాహనదారులకు గమనిక… ఈ-ఛలాన్ సర్వర్ డౌన్

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు భారీ డిస్కౌంట్ ఇవ్వడంతో వాహనదారులు పెండింగ్ ఛలాన్‌లు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రూ.100 జరిమానా ప‌డితే..రూ.25 చెల్లిస్తే స‌రిపోతుందంటూ ఆఫర్ ఇవ్వడంతో తొలిరోజే పెద్ద ఎత్తున వాహనదారులు ఛలాన్‌లు కట్టేందుకు పోటెత్తారు. ఈ కార‌ణంగా పెండింగ్‌లో ఉన్న ఛ‌లాన్లు నిమిషానికి 700 చొప్పున క్లియ‌ర్ అవుతున్నాయని తెలుస్తోంది. అయితే వాహనదారులందరూ ఒక్కసారిగా వెబ్‌సైట్ మీదకు రావడంతో ఈ-ఛలాన్ సర్వర్ క్రాష్ అయ్యిందని అధికారులు చెప్తున్నారు.

సర్వర్ క్రాష్ కావడంతో పెండింగ్ ‌చలాన్ల క్లియ‌రెన్స్‌కు అంత‌రాయం ఏర్పడింది. రోజుకు ల‌క్ష నుంచి 3 ల‌క్షల మంది వాహ‌న‌దారులు త‌మ ‌ఛలాన్‌లను క్లియర్ చేసేందుకు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తార‌ని అధికారులు భావించారు. ఆ మేర‌కు ఆ ఒత్తిడిని త‌ట్టుకుని నిల‌బ‌డేలా స‌ర్వర్‌ కూడా అప్ డేట్ చేశారు. అయితే తొలి రోజే 3 ల‌క్షల‌కు పైగా వాహ‌న‌దారులు ఒకేసారి వెబ్ సైట్‌ను ఆశ్రయించ‌డంతో సైట్ డౌన్ అయిపోయింది. కాగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ ఛలాన్‌లు ఉన్నాయి. ఆయా ఛలాన్‌లను డిస్కౌంట్‌తో చెల్లించేందుకు మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు అధికారులు అవకాశమిచ్చారు.

Exit mobile version