Site icon NTV Telugu

Bandi Sanjay: కేంద్రం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది

Bandi Sanjay On Kcr

Bandi Sanjay On Kcr

Telangana Developing With Centre Funds Says Bandi Sanjay: కేంద్రం ఇస్తోన్న నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలను గాలికొదిలేసి, దేశ రాజకీయాలంటూ కేసిఆర్ తిరుగుతున్నాడని విమర్శించారు. కేసీఆర్‌ని ఓ మూర్ఖుడు అని, ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చాడని ఆరోపణలు చేశారు. మాయ మాటలు చెప్పి, మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తూ.. రాజకీయాలు చేస్తున్నాడని కామెంట్స్ చేశారు. ఓట్ల కోసం పొట్టుపొట్టు పైసలు పంచడమే టిఆర్ఎస్ వాళ్ళకి తెలిసిన పని అని ఆరోపించారు. ప్రజలను దోచుకుని, వేల కోట్లు సంపాదించుకొని, ఎన్నికల్లో ఖర్చు పెట్టడమే టీఆర్ఎస్‌కు తెలిసిన విద్య అని అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించేందుకు, ఆత్మవిశ్వాసం పెంచేందుకే తాను ఈ పాదయాత్ర చేపట్టానని తెలిపారు.

ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చే పైసలు తీసుకుని, ఓటు మాత్రం ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్ది, టీఆర్ఎస్ వాళ్ళ బాక్సులు బద్దలు కొట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. దుబ్బాకలో ఓటుకు పదివేలు, హుజూరాబాద్‌లో ఓటుకు 20 వేలు, ఇప్పుడు మునుగోడులో 30 వేలు పంచుతున్నాడన్నారు. జీహెచ్ఎంసీలో ఒక్కొక్క డివిజన్‌కు రూ. 10 కోట్లు టీఆర్ఎస్ ఖర్చు చేసిందని.. అంత డబ్బు వెచ్చించినప్పటికీ జీహెచ్ఎంసీలో 48 స్థానాల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. అనేక సంక్షేమ పథకాలు, నిధులు వస్తాయని హామీ ఇచ్చారు. అన్ని సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్, న్యూయార్క్, సింగపూర్ చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? అని నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి, గెలిపించాలని ఆయన కోరారు.

ప్రత్యేక తెలంగాణ కోసం ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్ష చేసి, మందు తాగాడని బండి సంజయ్ ఆరోపించారు. ఢిల్లీలో దొంగ దీక్ష చేసిన కెసిఆర్ గురించి మందు పోసినోడే తనకు చెప్పాడని అన్నారు. కాగా.. రేపు పెద్ద అంబర్‌పేట్‌లో జరిగే నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు, అందరూ వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వస్తున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Exit mobile version