Site icon NTV Telugu

Congress: నేడు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ.. కొండా మురళి, రాజగోపాల్ రెడ్డిపై చర్యలు..?

Congress

Congress

Congress: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 10న) పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరగనుంది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. అయితే, ఇటీవలి కాలంలో పార్టీలో వరుసగా అంతర్గత కలహాలు చోటుచేసుకోవడం, కొందరు నేతల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం వంటి పరిణామాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళీ చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా హస్తం పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇక, కొండా మురళీ, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఈ సమావేశంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Read Also: Filmfare Glamour And Style Awards South : ఫిలింఫేర్ అవార్డ్స్ విజేతలు వీరే..

అయితే, గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని మునుగోడు ఎమ్మెల్యే కోమటిడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస విమర్శలు చేస్తున్నారు. పార్టీ అంటే ఇష్టమే కానీ.. అంటూనే సీఎంపై విమర్శలు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. అలాగే, మంత్రి పదవి లభించలేదనే కారణంతో తన అసంతృప్తిని పలుమార్లు బహిరంగంగా రాజగోపాల్ రెడ్డి వినిపించారు. ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చూసుకుంటుందని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

Read Also: Peddhi : బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ఆ స్టార్ హీరోయిన్‌తో ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్..!

ఇక, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదు.. దీనిపై రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతాను.. ఇవాళ జరిగే భేటీలో చర్చించిన తర్వాత అన్ని విషయాలు చెబుతాను అని పేర్కొన్నారు. మరోవైపు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయన వైరిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసింది. దీనిపై ఇవాళ జరిగే క్రమశిక్షణ కమిటీ సమాచారంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక, కొండా మురళీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇరువురికి నోటీసులు ఇచ్చి వివరణ కోరుతారా? క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని అడుగుతారా? అనేది వేచి చూడాలి.

Exit mobile version