ఇవాళ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంతో పాల్గొనడంతో పాటు పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇక్రిశాట్, ముచ్చింతల్‌ల్లో జరిగే కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే పాల్గొంటారని వివరించాయి. నిజానికి, ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలకడానికి కేసీఆర్ వెళ్లడం లేదన్న ప్రచారం శుక్రవారం జరిగింది. ఇందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటారని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సీఎంవో వర్గాల సమాచారంతో తేలిపోయింది.
అధికారిక కార్యక్రమాలకు ప్రధాని హాజరైతే గవర్నర్, ముఖ్యమంత్రి, నగర మేయర్, సీఎస్, డీజీపీ తప్పకుండా హాజరై స్వాగతించాలంటూ ప్రొటోకాల్ నిబంధన ఉంది.ప్రధానిని స్వాగతించడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కేసీఆర్ వెళతారు.
మధ్యాహ్నం 2.10గంటలకు ఎయిర్‌పోర్టులో స్వాగతం చెబుతారు. అక్కడి నుంచి ఇద్దరూ హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు వెళతారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అనంతరం, సాయంత్రం 4 గంటలకు ముచ్చింతల్‌కు వెళతారు. అక్కడ రామానుజుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 8.15 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ ప్రధానికి వీడ్కోలు పలుకుతారు.
