NTV Telugu Site icon

Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. డీఏపై చర్చ..!

Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting

Telangana Cabinet: తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందన్న ప్రచారం నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో అజెండాలో ఉన్నాయని తెలిపాయి. స్వయం సహాయక సంఘాలమహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, వారికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం అమలు వంటి అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించడంపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయాలను ప్రకటించనున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామన్న హామీ ఇప్పట్లో అమలయ్యే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే ఎలాంటి నిర్ణయాలు ఉండకపోవచ్చని తెలిసింది.

Read also: Astrology: మార్చి 12, మంగళవారం దినఫలాలు

కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదించే అవకాశం ..!

దాసోజు శ్రవణ్ మరియు కుర్ర సత్యనారాయణలను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఇటీవల ఈ ఉత్తర్వులను కొట్టివేసిన రాష్ట్ర హైకోర్టు.. వారి పేర్లను మరోసారి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, కోటండరామ్, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదించే అవకాశం ఉంది. 1100 మంది రిటైర్డ్ అధికారులు ప్రభుత్వంలో కొనసాగాలా? ఈ అంశంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటుంది కదా. అలాగే విద్యుత్ సంస్థల్లో కొత్త డైరెక్టర్లు, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, అదనపు పోస్టులతో గ్రూప్-2, గ్రూప్-3కి అనుబంధ నోటిఫికేషన్ల జారీని మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది.

Read also: BJP : 8రాష్ట్రాల్లో 100సీట్లపై బీజేపీ అభ్యర్థుల పేర్లపై చర్చ.. రెండో జాబితా ఖరారు!

కాళేశ్వరంపై విచారణ..!
కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్ల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందం, కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం నిర్మాణం, మిషన్‌ భగీరథపై జ్యుడీషియల్‌, విజిలెన్స్‌ విచారణ జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆయా విచారణలకు సంబంధించిన విధివిధానాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ, ఇతర దర్యాప్తు సంస్థలను విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 15 అంశాలపై విచారణ జరపాలని నీటిపారుదల శాఖ విధివిధానాలను సిద్ధం చేసింది.
Gold Price Today : గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తులం ఎంతంటే?