Telangana: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి విస్తరణపై చాలా రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలో తెరపడే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం, జనవరిలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిమండలిలో మరో ఇద్దరు మంత్రులను తీసుకోవడానికి వీలుంది, అంటే రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురిని తొలగిస్తారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, ఈ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రివర్గ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను మహేష్ గౌడ్ తోసిపుచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను తప్పిస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై మహేష్ గౌడ్ స్పందిస్తూ, ఆ ఇద్దరు మంత్రులు కేబినెట్‌లో కొనసాగుతారని స్పష్టత ఇచ్చారు. కేబినెట్‌లో తీసివేతలు ఉండవని, కేవలం చేరికలే ఉంటాయని ఆయన అన్న మాటలు కొందరికి ఊరట కలిగించాయి. కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే ఆయన ఈ ప్రకటన చేశారా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిగాయా అనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
కొంతమంది మంత్రులపై వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, వారిని తొలగించే అవకాశం లేదని, అయితే శాఖల మార్పు మాత్రం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శాఖల మార్పులు చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది, అయితే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కూడా కొంత స్వేచ్ఛను ఇచ్చినట్లు సమాచారం.
మంత్రివర్గ విస్తరణలో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఈ పదవుల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారా లేదంటే కేబినెట్‌లో ప్రాతినిధ్యం దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జనవరిలో జరగబోయే ఈ విస్తరణతో కేబినెట్ పూర్తిస్థాయిలో కొలువుదీరే అవకాశం ఉంది.
Prithvi Shaw Unsold: పాపం పృథ్వీ షా.. ఈసారి కూడా ఎవరూ దేకలే!
