NTV Telugu Site icon

BJP: ఆ ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించాలి.. గవర్నర్‌కు బీజేపీ వినతి

Bjp

Bjp

తెలంగాణలో వరుస ఆత్మహత్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు.. రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య, కామారెడ్డిలో సంతోష్, పద్మల ఆత్మహత్యలపైన సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు.. ప్రతిపక్ష నాయకులను కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు హింసిస్తున్నారు.. రాష్ట్ర పోలీసులు విచారణ జరిపితే నిష్పక్షపాతంగా జరగదు.. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరినట్టు వెల్లడించారు. ఖమ్మం సాయి గణేష్, కామారెడ్డిలో సంతోష్, పద్మ ఆత్మహత్యలపైన సీబీఐతో విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు రఘునందన్‌రావు.

Read Also: Talasani : గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు.. ఏది పడితే అది మాట్లాడొద్దు..!

ఇక, రాజకీయ ప్రత్యర్ధులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. బీజేపీ కార్యకర్తలను అణిచి వేస్తున్నారని మండిపడ్డ ఆయన.. బీజేపీపై టీఆర్ఎస్‌ దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని.. రాజీనామా చేయకపోతే ప్రభుత్వం భర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు పోలీసులు టీఆర్ఎస్‌ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి.. ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా కేసీఆర్ మార్క్ పాలన జరుగుతుందన్న ఆయన.. పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి… లేకుంటే ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు.. ఖమ్మం, రామాయంపేట ఘటనలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరామని.. కేసీఆర్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, ఆత్మ హత్యలు తన దృష్టిలో ఉన్నాయని తెలిపిన గవర్నర్‌.. బాధ కరమైన సంఘటనలు అని ఆవేదన వ్యక్తం చేసినట్టు బీజేపీ నేతలు తెలిపారు.