Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం

  • జీవో 59 పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం
  • జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
  • అక్రమాలకు తావులేకుండా దరఖాస్తుల పరిశీలన
  • 22-ఎ భూముల రిజిస్ట్రేషన్లకు ఫాస్ట్‌ట్రాక్ విధానం
Ponguleti

Ponguleti

రాష్ట్రంలో దశాబ్దాలుగా నలుగుతున్న 22-ఎ భూ సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. 22-ఎ సమస్యల శాశ్వత పరిష్కారానికై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏడు కీలక ఉత్తర్వులను జారీ చేసినట్లు ప్రకటించిన మంత్రి, జి.ఓ. 59 దరఖాస్తుదారులకు తీపి కబురు అందించారు. 500 చదరపు గజాల లోపు ఉన్న జి.ఓ. 59 పెండింగ్ దరఖాస్తులను కేవలం నెల రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ‘మెమో నెం.48030’ను అధికారికంగా జారీ చేసింది.

గత అక్రమాలకు తావులేకుండా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు

జి.ఓ. 59 అమలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకూ తావులేకుండా పూర్తి నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ జీవో అమలులో జరిగిన అక్రమాలు, అక్రమ క్రమబద్ధీకరణలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. దీనికోసం గతంలో ఇప్పటికే జారీ చేసిన కన్వేయన్స్ డీడ్స్ (Conveyance Deeds) కేసులను సైతం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చట్టబద్ధమైన హక్కులున్న ఏ ఒక్క నిజమైన లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పారదర్శకతతో ప్రక్రియ ముగించాలని స్పష్టం చేశారు.

22-ఎ భూములపై ఫాస్ట్‌ట్రాక్ నిర్ణయాలు: రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం పచ్చజెండా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. 22-ఎ కింద ఉన్న సుమారు 10 నుంచి 12 రకాల సంక్లిష్ట సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో వేగవంతంగా పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికే జి.ఓ.118, జి.ఓ.76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలను జారీ చేశామని వెల్లడించారు. ప్రధానంగా 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ.. జీహెచ్‌ఎంసీ (GHMC), హెచ్‌ఎండీఏ (HMDA), డీటీసీపీ (DTCP) , సంబంధిత మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రజలకు పెద్ద ఊరట నిచ్చామన్నారు. అంతేకాకుండా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి, , నాలా (NALA) ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్ సమస్యలకు త్వరితగతిన ముగింపు పలుకుతున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.