Site icon NTV Telugu

Telangana TDP: తెలంగాణ ఎన్నికల్లో 89 స్థానాల్లోనే టీడీపీ పోటీ.. లిస్టు విడుదలపై నేడు క్లారిటీ

Telangana Tdp

Telangana Tdp

Telangana TDP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి. దాదాపు పూర్తి స్థాయి కవరేజీతో బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేయగా, బీజేపీ 52 స్థానాలు, కాంగ్రెస్ 55 స్థానాల్లో ఉన్నాయి. రెండో జాబితా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో పూర్వవైభవం కోసం పాకులాడుతున్న తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ ఎన్నికల్లో 89 నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. తెలంగాణ టీడీపీ అక్కడి నుంచి నియోజకవర్గాలు, టికెట్ ఆశించేవారి ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. ఈ వివరాలతో కూడిన జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధినేత కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు చంద్రబాబును కలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ములాఖత్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎన్టీఆర్ భవన్‌లో రాష్ట్ర స్థాయి, పార్లమెంటరీ స్థాయి నేతలతో కలిసి కసరత్తు పూర్తి చేశారు. 119 నియోజకవర్గాలకు గాను 89 స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తం 189 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ పోటీకి దూరంగా ఉండొచ్చని భావిస్తున్న 30 నియోజకవర్గాల్లో హైదరాబాద్ లోక్ సభ ప్రాంతంతో పాటు ఉమ్మడి వరంగల్ , ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. కసరత్తు పూర్తయిన 89 నియోజకవర్గాల్లో కొన్నింటికి ఒకరి పేరు, మరికొన్నింటికి రెండు పేర్లు ఉన్నాయి. కొన్ని చోట్ల ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం, బరిలో ఉన్న సీట్ల సంఖ్య, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చంద్రబాబు బాబుదే తుది నిర్ణయం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జనసేనతో పొత్తు విషయం కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీలో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయని, తెలంగాణలో మాత్రం ఆ అవకాశం లేదని ప్రకటించారు. ఇప్పటికే అమిత్ షాతో పవన్, కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోనున్నాయి. టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
Amith Shah: తెలంగాణలో అమిత్ షా టూర్.. షెడ్యూల్ ఇదీ..

Exit mobile version