Site icon NTV Telugu

Chandra Babu: ఐఎస్‌బీ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న చంద్రబాబు

Isb Chandrababu

Isb Chandrababu

హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే అందరికీ టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తొస్తారు. ముంబై లేదా బెంగ‌ళూరులో ఏర్పాటు అవుతుంద‌నుకున్న ఐఎస్‌బీని చంద్రబాబు హైద‌రాబాద్ తీసుకువ‌చ్చారు. 2001లో టీడీపీ హయాంలోనే ఐఎస్‌బీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ వేడుక‌లు జరుపుకుంటోంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా ఐఎస్‌బీ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుసగా 17 ట్వీట్లు చేశారు.

గ‌చ్చిబౌలి ప్రాంతాన్ని ఫైనాన్సియ‌ల్ డిస్ట్రిక్ట్‌గా మార్చే దిశ‌గా ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్న స‌మయంలోనే త‌న మ‌దిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఓ బిజినెస్ స్కూల్ ఏర్పాటైతే గ‌చ్చిబౌలి రూపు రేఖ‌లే మారిపోతాయ‌ని భావించిన‌ట్లు చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు క‌లిసి అత్యున్నత స్థాయి ప్రమాణాల‌తో కూడిన బిజినెస్ స్కూల్‌ను ఏర్పాటు చేయాల‌నుకుంటున్నార‌ని, అందులో భాగంగా దాని పేరును ఐఎస్‌బీగా పెట్టార‌ని, దానికి డైరెక్టర్ల బోర్డు కూడా ఏర్పాటు అయిందన్న విష‌యం తనకు తెలిసిందని చంద్రబాబు నెమరువేసుకున్నారు. అయితే పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఐఎస్‌బీని దేశంలో అప్పటికే అభివృద్ధి చెందిన ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు జరుపుతుండగా తాను వారి ముందు హైదరాబాద్ ప్రతిపాదన తెచ్చినట్లు చంద్రబాబు గుర్తుచేశారు.

సుదీర్ఘ చర్చల తర్వాత ఐఎస్‌బీని 2001 డిసెంబర్ 2న అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారని చంద్రబాబు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అయితే ఐఎస్‌బీ రాక‌ముందు గ‌చ్చిబౌలి ప్రాంతం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అన్న ఫొటోల‌తో పాటు ఐఎస్‌బీ ప్రారంభోత్సవానికి వ‌చ్చిన‌ వాజ్‌పేయితో తాను క‌లిసి ఉన్న ఫొటోల‌ను కూడా చంద్రబాబు ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Exit mobile version