Site icon NTV Telugu

ప్రజా సమస్యల కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రత్యేక యాప్

వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇకపై ప్రజలు తాము ఉన్న చోట నుంచే తమ సమస్యలను ప్రస్తావించి పరిష్కరించుకునే విధంగా ప్రజా బంధు పేరుతో నూతన యాప్‌ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజాబంధు యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను ఇకపై నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. త్వరలో ఈ యాప్‌ ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Read Also: ఏపీ సీఎం జగన్ చిత్రపటానికి బంగారు పూలతో అభిషేకం

ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లాయో లేదో అనే విషయం కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యను సంబంధిత అధికారి ఎప్పుడు పరిష్కరిస్తారు.. ఎంత సమయం పడుతుంది.. లాంటి వివరాలు కూడా యాప్‌లో నమోదు అవుతాయంటున్నారు. ఏదైనా ఫిర్యాదును అధికారులు తిరస్కరిస్తే అందుకు కారణాలను కూడా అందులో వివరిస్తారట. ఈ విధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారని… ఇది విజయవంతం అయితే మరికొందరు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఇదే పద్ధతిని ఫాలో అయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version