Talasani Srinivas Yadav Requests Munugodu People To Give Counter To Opposition Parties: తెలంగాణలో 24 గంటల విద్యుత్, తాగు, సాగు నీరు ప్రజలకు అందించిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని కొనియాడారు. కొందరు మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలే సాక్ష్యమని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. మునుగోడుకు ఏం చేశారో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మునుగోడు సభలో ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎవరూ రాజీనామా చేస్తే జరగడం లేదని.. కేసీఆర్ ముందుచూపు వల్లే అధి సాధ్యం అవుతోందని చెప్పారు. యాదాద్రి పునర్నిర్మాణం చేసిన గొప్ప వ్యక్తి కేసిఆర్ అని పేర్కొన్నారు. మొత్తం తెలంగాణ భూభాగం నాదే అనుకొని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని.. విద్యా, వైద్యంలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. మునుగోడుకు వస్తున్న కొందరు నేతలు అవాక్కులు, చెవాక్కులు మాట్లాడుతున్నారని.. వారికి మునుగోడు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. మునుగోడు కిష్టాపురం గ్రామంలో గొర్రెలకు, పశువులకు, వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ పై విధంగా స్పందించారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన 6 సంవత్సరాల్లోనే మునుగోడులో ఫ్లోరైడ్ తగ్గించేలా చర్యలు తీసుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. చెరువులు అద్భుత సంపద సృష్టిస్తాయని గుర్తించింది కేసీఆర్ అని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేసిఆర్ చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. సీఎం దూరదృష్టి వల్లే తెలంగాణలో ప్రతిరోజూ మృగశిరకార్తీగా మారిపోయిందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాతే మత్స్యకార జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు. దేశంలో చేప పిల్లలను ఉచితంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, తెలంగాణ మత్స్యకార సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలతో మత్స్యకారులు స్వతంత్రంగా ఎదుగుతున్నారని.. మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వంతో కలిసి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. బడుగు-బలహీన వర్గాలకు పదవులు ఇచ్చింది ఒక్క సీఎం కేసీఆరేనని చెప్పారు. చేతి వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనని.. సంక్షేమంలో ముందున్న టీఆర్ఎస్, కేసిఆర్‌కు ప్రతీ ఒక్కరు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
