NTV Telugu Site icon

Gun Firing: పాతబస్తీలో గన్ ఫైరింగ్.. సివిల్ వివాదంలో ఇరువర్గాల మధ్య గొడవ

Merchouk Crime

Merchouk Crime

Gun firing: హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ లో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఇరువర్గాల మధ్య సివిల్ వివాదం చెలరేగింది. ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మసూద్ అలీ అనే న్యాయవాది లైసెన్స్ డ్ గన్ తో గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పాతబస్తీలోని మీర్ చౌక్ లో కొద్ది రోజుల క్రితం అర్ఫాత్ అనే వ్యక్తి ఇల్లు కొన్నాడు. అయితే ఆ ఇంటి విషయంలో గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. కోర్టులో కేసు ఉండగా ఇల్లు ఎలా కొనాలని పక్క ఇంటి వారు గొడవకు దిగారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా ఈ విషయంపై అర్ఫాత్ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి మసూద్ అలీ, మోర్ఖుజా తదితరులు అర్ఫాత్ తో గొడవపడ్డారు. వారిని భయపెట్టేందుకు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. మహిళలు కూడా కర్రలు పట్టుకుని మాటల యుద్ధానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Conflict Between Tigers: ఆధిపత్యం కోసం రెండు పులుల మధ్య యుద్ధం.. ఒకటి మృతి