Site icon NTV Telugu

Statue Of Equality: సమతామూర్తి సందర్శన వేళలు ప్రకటన

హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రాన్ని దర్శించాలని భావించే భక్తుల కోసం నిర్వాహకులు సందర్శన వేళలను ప్రకటించారు. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని నిర్వాహకులు తెలిపారు. సమతామూర్తి కేంద్రానికి బుధవారం సెలవు ఉంటుందన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులు సమతామూర్తిని దర్శించవచ్చని సూచించారు.

మార్చి 9వ తేదీ నుంచి ఈ టైమింగ్స్ అమల్లోకి వస్తాయని నిర్వాహకులు తెలియజేశారు. ప్రవేశ రుసుము 6-12 ఏళ్లలోపు పిల్లలకు రూ.75, పెద్దలకు రూ.150గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారులను ఉచితంగా లోపలకు అనుమతి కల్పిస్తామన్నారు. కాగా సమతా మూర్తి కేంద్రానికి ఇటీవల శ్రీరామనగరంగా పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరామనగరంలో 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.

మరోవైపు సమతామూర్తి కేంద్రంలోని 120 కిలోల శ్రీరామానుజచార్యుల సువర్ణమూర్తి విగ్రహం దర్శనం, త్రీడీ మ్యాపింగ్‌ లేజర్‌ షో, ఫౌంటేన్‌ అందాలను నిర్వాహకులు తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ ఫ్రేం ఏర్పాటు సహా ఇతరత్రా సాంకేతిక పనుల పూర్తికి మరో వారం రోజులు పడుతుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Exit mobile version