Site icon NTV Telugu

కొన్నాళ్లుగా ఆ టీఆర్‌ఎస్‌ ఎంపీ సైలెంట్‌ !

ఆ టీఆర్‌ఎస్‌ ఎంపీ కొన్నాళ్లుగా యాక్టివ్‌గా లేరు. మరోవైపు చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వెనక కారణాలేవైనా.. పార్టీ మారడం లేదని ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకా ప్రకటన చేశారు? తెరవెనక ఏం జరిగింది? ఎవరా ఎంపీ?

రెండోసారి ఎంపీ అయ్యాక లోకల్‌గా ఇబ్బందులు!
బీజేపీలోకి వెళ్తారని ప్రచారం!

2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తొమ్మిది ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి రెండోసారి లోక్‌సభ సభ్యుడయ్యారు బీబీ పాటిల్‌. నాటి రాజకీయ వాతావరణం ఆయనకు ఎన్నికల్లో కలిసి వచ్చినా.. నియోజకవర్గంలో మాత్రం పార్టీ ప్రజాప్రతినిధులతో గ్యాప్‌ వచ్చిందని టీఆర్‌ఎస్‌లో చెవులు కొరుక్కున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో పర్యటనలకు కూడా ఆయన ఇబ్బంది పడ్డారని వార్తలొచ్చాయి. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో పాటిల్‌ దూకుడు తగ్గించారని అనుకునేవారు. ఇదే సమయంలో పాటిల్‌ బీజేపీలోకి వెళ్లిపోతున్నారని ప్రచారం గుప్పుమంది. పార్టీ వర్గాలు కథలు కథలుగా చెప్పుకోవడంతో ఆయన పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారారు.

ఎమ్మెల్సీ కవితతో ఎంపీ పాటిల్‌ భేటీ

తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ బర్త్‌డేలో తళుక్కుమన్నారు ఎంపీ పాటిల్‌. రెండు మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోనూ ఆయన భేటీ అయ్యారట. తాజా పరిణామాలపై కవిత ఆరా తీసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుందని.. ఆందోళన పడొద్దని పాటిల్‌కు ఆమె భరోసా ఇచ్చారట. సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కలిసి సాగాలని సూచించారట కవిత. ఆ భేటీ తర్వాత ఎంపీ పాటిల్‌ సెట్‌ అయినట్టు తెలుస్తోంది. కొంత కాలంగా అటూ ఇటూగా ఉంటూ వచ్చిన ఆయన ఇకపై పార్టీలో క్రియాశీలకంగా ఉండేందుకు సిద్ధమైనట్టు చెబుతున్నారు.

బీజేపీలోకి వెళ్లడం లేదని ఎంపీ పాటిల్‌ ప్రకటన

కీలక సమావేశాలు ముగిసిన తర్వాత మారు మనసు పొందిన పాటిల్‌.. జహీరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. కేవలం పర్యటన చేస్తే సరిపోతదని భావించారో ఏమో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీలోకి వెళ్లడం లేదని.. అలాంటి ఆలోచనే లేదన్నది పాటిల్‌ వివరణ. అక్కడితో ఆగకుండా.. జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఉన్న మంత్రులు.. ఎమ్మెల్యేల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నట్టు తెలిపారాయన. కొన్నాళ్లుగా తనపై జరుగుతున్న ప్రచారానికి.. ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే యత్నం చేశారు పాటిల్‌.

పార్టీ పెద్దలతో భేటీ ఫలితం ఇచ్చిందా?

మొత్తానికి పార్టీ పెద్దలతో పాటిల్‌ భేటీ వర్కవుట్‌ అయినట్టు భావిస్తున్నారు. జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ పంచాయితీకి తరుణోపాయం సూచించారట. మరి.. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పాటిల్‌ ఎత్తుగడలు ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version