Site icon NTV Telugu

తెలంగాణలో ఐఏఎస్‌ల పరిస్థితి విచిత్రం !

తెలంగాణలో కొందరు ఐఏఎస్‌ల పరిస్థితి విచిత్రంగా తయారైంది. ట్రాన్స్‌ఫర్‌ అవుతారు కానీ.. పోస్టింగ్‌ ఉండదు. ఏడెనిమిది నెలలుగా ఇదే దుస్థితి. కలెక్టర్లుగా బిజీగా పనిచేసిన వారు రోజుల తరబడి వర్క్‌ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. అలాంటి ఆఫీసర్లపై అధికారవర్గాల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది.

కలెక్టర్లుగా పనిచేసిన వారికి ఏడెనిమిది నెలలుగా పోస్టింగ్‌ లేదు

సాధారణంగా ఒక IASను ఒక పోస్ట్ నుండి బదిలీ చేస్తే మరోచోట పోస్టింగ్ ఇస్తుంది ప్రభుత్వం. ఒకవేళ ఆ టైమ్‌లో కొత్తచోట అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఉంటే.. ఒకటి రెండు రోజులు ఆగుతుంది. తర్వాత పోస్టింగ్‌ ఇస్తుంది. కానీ.. తెలంగాణలో బదిలీ అయిన కొందరు కలెక్టర్లకు ఏడెనిమిది నెలలుగా పోస్టింగ్‌ లేదు. పక్కన పెట్టేశారు. ఈ జాబితాలో నిన్న మొన్నటి వరకు ముగ్గురు ఐఏఎస్‌లు ఉంటే.. ఇటీవలే ఇంకొకరు జత కలిశారు. కలెక్టర్లుగా పనిచేసిన నలుగురు IASలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ప్రభుత్వం కరుణిస్తే తప్ప వీరికి ఎక్కడా పోస్టింగ్‌ రాని దుస్థితి.

read also : తెలంగాణ కరోనా అప్‌డేట్‌..24 గంటల్లో 848

పోస్టింగ్‌ ఇవ్వకపోతే పనిష్మెంట్‌గా భావిస్తారా?

విధి నిర్వహణలో ప్రభుత్వానికి..స్థానిక అధికార పార్టీ నేతలకు ఇబ్బందులు కలిగించడం వల్లే ఆ నలుగురు ఐఏఎస్‌లను పక్కన పెట్టారని చర్చ జరుగుతోంది. బదిలీకి అదే కారణమట. ఈ విధంగా బదిలీ చేసి పోస్టింగ్‌ ఇవ్వకపోతే దానిని పనిష్మెంట్‌గా భావిస్తారని IAS వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌. కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సందీప్‌కుమార్‌ ఝాను గత ఏడాది నవంబర్‌లో బదిలీ చేశారు. అప్పటి నుంచీ ఆయన ఖాళీ. ఎక్కడా పోస్టింగ్‌ లేదు.

స్థానికంగా వచ్చిన ఇబ్బందుల వల్లే బదిలీ

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ను సైతం గత ఏడాది నవంబర్‌లో బదిలీ చేశారు. స్థానికంగా వచ్చిన ఇబ్బందులే ఆయన బదిలీకి కారణంగా చెబుతారు. ఆ ఎఫెక్ట్‌ వల్ల ఇప్పటికీ పోస్టింగ్‌ రాలేదు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లను సైతం ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అవినీతి కేసులో ఏసీబీ అరెస్ట్‌ చేసిన వారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ప్రభుత్వం బదిలీ చేసిందని చెబుతారు. ఇటీవలే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌పైనా వేటు పడింది. కేంద్ర ప్రభుత్వానికి ఆమెపై ఫిర్యాదు వెళ్లిందట. చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ నుంచి సీఎస్‌కు లేఖ రావడం వల్లే ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు సమాచారం.

నో పోస్టింగ్‌.. నో వర్క్‌!

మొత్తానికి కలెక్టర్‌గా పనిచేసిన నలుగురు ఐఏఎస్‌లు.. నో పోస్టింగ్‌.. నో వర్క్‌ అన్నట్టుగా రోజులు వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కరుణిస్తుందో తెలియదు. ఈ గ్రహణం ఎప్పుడు వీడుతుందా అని ఎదురు చూస్తున్నారు అధికారులు.

Exit mobile version