NTV Telugu Site icon

మన నేతల లాంగ్వేజ్‌ స్కిల్స్‌..

కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు..ఆదే నోరు జారితే? తీసుకోవటం కుదరదు. నరంలేని నాలుక ఏమైనా అంటుంది. ఇప్పుడు కొందరు నేతలకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ప్రస్తుతం రాజకీయాలంటేనే తిట్ల పురాణంలా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు ..తిట్టు ..ప్రతి తిట్టు. ఇప్పుడు ఇదే ట్రెండ్‌. నిన్న బండి వర్సెస్‌ మైనంపల్లి. తాజాగా రేవంత్‌ వర్సెస్‌ మల్లారెడ్డి. ఈ రెండు ఎపిసోడ్‌లలో నేతల భాషా ప్రావిణ్యాన్ని చూడోచ్చు. వాటిని ఆరోపణలు ప్రత్యారోపణలు అంటారా…లేదంటే తిట్లు ప్రతి తిట్లని అంటారో చూసినవారే చెప్పాలి.

ఇప్పుడు పార్టీల మధ్య ఫైట్‌ పర్సనల్‌ అయింది. బండి, మైనంపల్లి గొడవ అలాంటిదే. వారి లొల్లికి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వేదికయ్యాయి. మల్కాజ్‌గిరి ఇండిపెండెన్స్‌ డే ఫంక్షన్‌లో గులాబీ, కాషాయం మధ్య పెద్ద గొడవ జరిగింది. అందులో కమలం పార్టీ కార్పోటర్‌కి దెబ్బలు తగిలాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆస్పత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అంత వరకు బాగానే ఉంది. కానీ ఆ తరువాతే అసలు లొల్లి షురూ!!

రేపటి నుంచి నీ సంగతి చూస్తాం అంటూ మైనంపల్లికి పరుష పదజాలంతో వార్నింగ్‌ ఇచ్చారు బండి. మరి మైనంపల్లి ఏమైనా తక్కువ తిన్నారా.. బండికన్నా మరింత హాట్‌ హాట్‌గా కౌంటర్ ఎటాక్‌ చేశాడు. తన లాంగ్వేజ్‌ స్కిల్సన్నీ బండిపై ప్రయోగించారు. ఇక ఇప్పుడు తాజా తిట్ల పురాణం రేవంత్‌ వర్సెస్‌ మల్లారెడ్డి. ఇద్దరూ బడా నేతలే. ఇకరు గులాబీ నేత ..రాష్ట్ర మంత్రి. మరొకరు పీసీసీ చీఫ్‌ ప్లస్‌ ఎంపీ. రేవంత్‌ లేటెస్టు దళిత గిరిజన ఆత్మ గౌరవ దీక్ష దీనికి వేదికైంది. మంత్రి మల్లారెడ్డిని బేస్‌ చేసుకుని సీఎంకు చాలెంజ్‌ విసిరారు పీసీసీ చీఫ్‌. అయితే అది సింపుల్‌ చాలెంజ్‌ అయితే ఇంత మంది మాట్లాడుకునేవారు కాదు..రేవంత్‌ తనదైన శైలి తిట్లతో మల్లారెడ్డి మీద విరుచుకుపడ్డారు. మరి మల్లారెడ్డి మామూలోరా! అదే రేంజ్‌లో తిట్లతో పంచ్‌లు విసిరారు. తొడకొట్టి సవాలు చేశారు. దమ్ముంటే రాజీనామా చేసిరా అన్నారు. ఇద్దరం పోటీ చేద్దాం…ఓడిపోతే పాలిటిక్స్‌ కి గుడ్‌బై చెపుతా అని ఛాలెంజ్‌ చేశారాయన.

మల్లారెడ్డి మాటలపై రేవంత్‌ రెడ్డి ఇంకా రియాక్టవలేదు. కానీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఘాటుగానే స్పందిస్తున్నారు. చామకూర మల్లారెడ్డి పై కాంగ్రెస్‌ నేతలు ,కార్యకర్తలు భగ్గుమంటున్నారు. బోయినపల్లి లోని మంత్రి నివాసం ముట్టడికి ట్రై చేశారు దళిత కాంగ్రెస్ నేతలు. అయితే దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మల్లారెడ్డి నివాసానికి సెక్యూరిటీ పెంచారు.

నేతలు తమ నోటికి ఎంతమాటొస్తే అంత మాట అనేయటం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ నాయకులా ఇంకేమైనానా అనే వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. అయితే ఈ పొలిటికల్‌ తిట్ల ట్రెండ్‌ మన తెలంగాణకే కాదు దేశమంతటా ఉంది. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఓ నాయకుడు నోరు జారుడు. ఆయన సాదా సీదా నేత కాదు..మాజీ ముఖ్యమంత్రి , ప్రస్తుత కేంద్ర మంత్రి నారాయణ రాణే. ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది ఎవరి మీదో కాదు..సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే మీద.

ఇంతకూ రాణే ఏమన్నారంటే … స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందో కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు.. ఎన్నవ ఇండిపెండ్స్‌ డూ అని పక్కనున్న వ్యక్తిని అడిగి తెలుసుకున్నారు.. ఒకవేళ నేనే అక్కడుంటే అతని గూబ గుయ్యిమనిపించేవాడిని అన్నారు రాణె. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి మంత్రి అరెస్టుకు దారితీసింది. ఇంకా ఆ రచ్చ కంటిన్యూ అవుతూనే వుంది. బాధ్యతగా మాట్లాడవలసిన రాజకీయ నాయకులు ఇంత చీప్‌గా మాట్లాడి ఏం సాధిస్తారని సామాన్య ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఈ విషయం నేతలు గుర్తించుకుంటే మంచిందేమో!!