హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ నెల 12 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. చత్తీస్ గఢ్ నుంచి కోస్తా మీదుగా ఏర్పడిన ద్రోణి గురువారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని దీంతో రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
రాబోయే రెండు రోజులు గోవా, కర్నాటకతో పాటు దక్షిణ ఏపీలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ సారి అనుకున్న దాని కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో మలబార్ తీరంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు కర్నాటకలోని చాలా ప్రాంతాలకు ఇప్పటికే నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. ఈ సారి నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో సాధారణ వర్షపాతం కురుస్తుందని ఇప్పటికే భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) అంచనా వేసింది.
ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘాలతో నిండి చల్లగా ఉంటోంది. రాష్ట్రంలో గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో 44.9 డిగ్రీలు, హన్మకొండ జిల్లా ధర్మాసాగర్ లో 44.6 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 44.4 డిగ్రీల, ఖాజీపేటలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ నెల 13 వరకు రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
