Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..

  • 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడులు
  • మ్యూల్ ఖాతాలు, నకిలీ కేవైసీ పత్రాల దందా గుట్టురట్టు
  • డెబిట్ కార్డులు, పాస్‌బుక్కులు, సిమ్ కార్డులు స్వాధీనం
  • ట్రాన్సిట్ వారెంట్లతో నిందితులను హైదరాబాద్‌కు తరలింపు
Cyber Crime

Cyber Crime

దక్షిణ భారతదేశంలో సైబర్ నేరగాళ్ల మూలాలను పెకలించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బృహత్తర ఆపరేషన్‌ను సఫలీకృతం చేశారు. గత రెండు వారాలుగా అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ దాడులలో సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆసరాగా నిలుస్తున్న ఏజెంట్లు, ముఠా సభ్యులతో సహా మొత్తం 100 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మ్యూల్ ఖాతాలు, కేవైసీ పత్రాల దందా గుట్టు రట్టు

సైబర్ మోసాలకు పాల్పడే సూత్రధారులకు ఇతరుల పేర్లతో ఉండే ‘మ్యూల్ ఖాతాలు’ (Mule Accounts) సమకూర్చడం, అందుకు అవసరమైన నకిలీ కేవైసీ (KYC) పత్రాలను అందించడమే లక్ష్యంగా ఈ ముఠాలు పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. అమాయకులైన పౌరుల నుంచి వివిధ ప్రలోభాలతో కేవైసీ పత్రాలను సేకరించి, వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిచి సైబర్ ముఠాలకు విక్రయిస్తున్న ఏజెంట్లను అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి భారీ సంఖ్యలో మ్యూల్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు, బ్యాంకు పాసు పుస్తకాలు, చెక్ బుక్కులు , చెల్లుబాటులో ఉన్న సీమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు నిందితుల తరలింపు

పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో పట్టుబడిన ప్రధాన నిందితులను ఆయా స్థానిక న్యాయస్థానాల్లో హాజరుపరిచిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్లు సాధించారు. అనంతరం వారిని భారీ భద్రత నడుమ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా దేశవ్యాప్తంగా సాగుతున్న పలు పెద్ద సైబర్ మోసాల వెనుక ఉన్న ముఠాల లింకులు బయటపడే అవకాశం ఉందని, హైదరాబాద్‌లోని బ్యూరో కార్యాలయంలో నిందితులను సుదీర్ఘంగా విచారించి తదుపరి చట్టపరమైన చర్యలు వేగవంతం చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.