NTV Telugu Site icon

Train Speed Increases: ఇక రైలు బండి మరింత స్పీడ్‌గా..

Train

Train

రైలు బండి.. దాని స్పీడ్‌పై గతంలోనే అనేక పాటలు వచ్చాయి… కానీ, కాల క్రమంగా రైళ్ల రూపం మారిపోయింది.. వేగం పెరిగింది.. ఇక, జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లేందుకు సిద్ధం అయ్యాయి రైళ్లు.. నేటి నుంచి దక్షిణ మధ్య రైల్వేలో రైళ్ల వేగం మరింత పెరగనుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా పట్టాలపై రైళ్లు మరింత స్పీడ్‌తో దూసుకెళ్లనున్నాయి. ట్రాక్‌ అప్‌గ్రెడేషన్‌ పనులు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి మూడు డివిజన్ల పరిధిలో ప్యాసింజర్‌, సరుకు రవాణా రైళ్ల వేగ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో.. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్‌ డివిజన్ ఉండగా.. ఆయా డివిజన్లలో 285 రైళ్లు నడుస్తున్నాయి.. అయితే, ఇవాళ్టి నుంచి సికింద్రాబాద్‌, విజయవాడ, గుంతకల్లు డివిజన్లలో ఎక్కువ సెక్షన్లలో గంటకు 130 కిలోమీటర్ల స్పీడ్‌తో రైళ్లను నడిపించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇది రైల్వేకి మరింత ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు.

Read Also: Astrology : సెప్టెంబర్‌12, సోమవారం దినఫలాలు

ఈ రోజు నుంచి సికింద్రాబాద్‌ డివిజన్‌లోని సికింద్రాబాద్‌- కాజీపేట-బల్హర్షా, కాజీపేట్‌-కొండపల్లి… విజయవాడ డివిజన్‌లోని కొండపల్లి- విజయవాడ-గూడూరు.. గుంతకల్‌ డివిజన్‌లోని రేణిగుంట- గుంతకల్‌- వాడి సెక్షన్లలో రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లనున్నాయి.. ప్యాసింజర్‌ రైళ్లతోపాటు గూడ్స్‌ రైళ్ల సగటు వేగం కూడా పెరగనుంది.. ఇప్పటి వరకు గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగ పరిమితి ఉండగా.. ఇవాళ్టి నుంచి అది 130కి పెరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.. ఇక, సెక్షనల్ స్పీడ్‌ని 130 కిలోమీటర్లకు పెంచడంలో సంబంధిత పనులను పూర్తి చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేజేజర్‌ అరుణ్‌ కుమార్‌.