కరోనా లాక్‌డౌన్ హీరో సోనూసూద్ మంచి మనసు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అంకుర హాస్పిటల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ వ్యవహరిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా తమ 12వ ఆస్పత్రిని అంకుర హాస్పిటల్స్ సంస్థ ప్రారంభించనుంది. ఈ ఏడాదిలోనే మరో నాలుగు ఆస్పత్రులను అంకుర సంస్థ ప్రారంభించనుంది. ఈ మేరకు తమ హాస్పిటల్స్ విస్తరణపై అంకుర యాజమాన్యం హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సోనూసూద్, అంకుర ఎండీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. కరోనా ప్యాండమిక్ సమయంలో చాలా ఆస్పత్రులకు తాను వెళ్లానని.. ప్రజల పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపించేదని వివరించాడు. కరోనా సమయంతో తన స్తోమతకు తగ్గ సేవ చేశానని.. ఇంకా చేస్తున్నట్లు సోనూసూద్ తెలిపాడు. అంకుర హాస్పిటల్స్ చాలా మంచి సేవలు అందిస్తోందని.. ఏడాది కాలంగా ఈ ఆస్పత్రితో తకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నాడు. లాక్‌డౌన్ సమయంలో అంకుర హాస్పిటల్స్‌తో కలిసి పనిచేసినట్లు గుర్తుచేసుకున్నాడు. ఇతర రాష్ట్రాలకు అంకుర విస్తరణ అనేది ఎంతోమందికి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఉపయోగపడుతుందన్నాడు.
ఈ కార్యక్రమంలో పొలిటికల్ ఎంట్రీపైనా సోనూసూద్ క్లారిటీ ఇచ్చాడు. తాను రాజకీయాల్లోకి వెళ్లనని.. తనకు ఆసక్తి కూడా లేదని స్పష్టం చేశాడు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించడంపైనే తన దృష్టి కేంద్రీకృతమై ఉందన్నాడు. తాను సినిమాలు, సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నట్లు వివరించాడు. ప్రజలకు సేవ చేయాలంటే పవర్ అవసరం లేదని.. దేవుడి దయ ఉంటే చాలని సోనూసూద్ అభిప్రాయపడ్డాడు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకంగా మారిందన్నాడు. ప్యాండమిక్ పోయినా.. ఇంకా సమస్యలు అలానే ఉన్నాయన్నాడు. మెగాస్టార్ చిరంజీవితో తాను చేసిన ఆచార్య త్వరలో విడుదల కాబోతుందని.. ఈ సినిమాతో పాటు కొన్ని కథలను విని షార్ట్ లిస్ట్ చేశానని సోనూసూద్ చెప్పాడు.
తెలుగు రాష్ట్రాల్లో తాము 12వ ఆస్పత్రిని త్వరలో ప్రారంభించనున్నట్లు అంకుర హాస్పిటల్స్ ఎండీ కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఈ ఏడాదిలోనే మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో హాస్పిటల్స్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న హాస్పిటల్స్‌లలో తమ సంస్థ కూడా ఉందన్నారు. త్వరలో తమ ఆస్పత్రుల్లో వెయ్యి నుంచి రెండు వేల బెడ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. సోనూసూద్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని.. మహిళలు, శిశు సంరక్షణలో కీలకంగా పనిచేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింతగా సేవా కార్యక్రమాలను తీసుకువెళ్తామన్నారు. సోనూ సూద్ ఫౌండేషన్‌తో కలిసి పేదలకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు కృష్ణప్రసాద్ వివరించారు.
