చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ నిర్మాణ పనులలో కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎదురవుతున్న భూగర్భ అడ్డంకులను గుర్తించేందుకు ఎన్జీఆర్ఐ (NGRI) శాస్త్రవేత్తలు నిర్వహించిన హెలి మాగ్నెట్ సర్వే నివేదిక తాజాగా నిపుణుల కమిటీకి చేరింది. ప్రత్యేక హెలికాప్టర్ సహాయంతో సుమారు 13 లైన్లలో సర్వే చేపట్టిన శాస్త్రవేత్తలు, భూమి లోపల దాదాపు 800 మీటర్ల లోతు వరకు ఉన్న భూ స్వరూపంపై సమగ్ర సమాచారాన్ని ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ సర్వేలో భాగంగా నల్లవాగు సమీప ప్రాంతంలో ‘షీర్ జోన్’ ఉన్నట్లు గుర్తించగా, మిగిలిన చోట్ల టన్నెల్ నిర్మాణానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు సమాచారం అందింది.
AP Deputy CM Pawan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. 96 గదుల నిర్మాణానికి శంకుస్థాపన
భూగర్భ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పుడు తన నిర్మాణ వ్యూహాన్ని మార్చే యోచనలో ఉంది. గతంలో ఉపయోగించిన టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, మిగిలి ఉన్న 9 కిలోమీటర్ల టన్నెల్ పనులను పూర్తి చేయడానికి ‘డ్రిల్ అండ్ బ్లాస్ట్’ పద్ధతిని ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మన్నేవారిపల్లి వైపు నుంచి ప్రస్తుత టిబిఎం మిషన్‌ను తొలగించేందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిపుణుల కమిటీ ఈ నివేదికను పరిశీలించిన తర్వాత, మరో రెండు మూడు రోజుల్లో ఎస్ఎల్బిసి టన్నెల్ పనులపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయితే సాగు, తాగునీటి సరఫరాకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.
