NTV Telugu Site icon

Fire Accident: సిద్దిపేట సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం.. నిలిచిన విద్యుత్ సరఫరా

Siddipet

Siddipet

Fire Accident: సిద్దిపేట విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం కారణంగా సిద్దిపేట పట్టణంతో పాటు పరిసర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లకు కూడా మంటలు వ్యాపించడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్ నుంచి ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి విద్యుత్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Read also: Maharastra : నేటి నుంచి సమ్మెకు దిగనున్న 8000మంది డాక్టర్లు.. నిలిచిపోనున్న వైద్య సేవలు

ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు హరీశ్ రావు అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించారు. అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపు చేయకపోవడంతో, మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటింగ్ ఫోమ్‌ను ఉపయోగించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ విద్యుత్‌ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారులు, సిద్దిపేట విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ అధికారులను హరీశ్ రావు కోరారు. ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
Arvind Kejriwal: పెరిగిన నీటి బిల్లులపై అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చిన ఢిల్లీ సీఎం..