NTV Telugu Site icon

SI Anil Issue: నేడు జగిత్యాల బంద్.. ఎస్ఐపై సస్పెండ్ ఎత్తివేయాలని వీహెచ్‌పీ డిమాండ్

Si Anil

Si Anil

SI Anil: జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అదే సమయంలో అనిల్ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జగిత్యాల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. జగిత్యాల బస్సు డిపో ముందు విశ్వహిందూ పరిషత్ ఆందోళన చేపట్టారు. దీంతో బస్సు డిపోకి ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. ఎస్సై అనిల్ పై సస్పెన్షన్ ఎత్తివేసి ఎస్సై అనిల్ కు, తన భార్యకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ అనిల్‌ స్పందించారు. బంద్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన శుక్రవారం విడుదల చేశారు. కొందరు రాజకీయ నేతలు, కొన్ని వర్గాలు తమ ప్రయోజనాల కోసమే బంద్‌ చేస్తున్నాయని అనిల్‌ ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, చట్టంపై తనకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌ అంశాన్ని పరిష్కరిస్తామని అనిల్‌ తెలిపారు.

కరీంనగర్‌లో బస్సులో సీటు ఇవ్వలేదని ఓ మహిళపై ఎస్‌ఎస్‌ఐ దాడి చేశాడు. సిద్దిపేటకు చెందిన ఓ మహిళ మంగళవారం మే 11న తన తల్లితో కలిసి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే బస్సు కరీంనగర్ బస్టాండ్ చేరుకున్న తర్వాత ఎస్సై భార్య ఎక్కింది. దీంతో బస్సులో సీటు విషయంలో సిద్దిపేట నుంచి వెళ్తున్న ఎస్‌ఐ భార్యకు, మరో మహిళకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే బస్సు జగిత్యాలకు రాగానే అనిల్ కుమార్ బస్సు ఎక్కాడు. మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనను ఆమె మొబైల్‌లో రికార్డు చేస్తుండగా ఎస్‌ఐ ఆమె వద్ద నుంచి ఫోన్ లాక్కొని చెంపదెబ్బ కొట్టాడు. బాధితురాలు జగిత్యాల టౌన్-1 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ, అతని భార్య కూడా తనను దుర్భాషలాడారని, ఎస్‌ఐ తనను బస్సులోంచి బయటకు లాగారని బాధితురాలు తెలిపింది. దీంతో ఈ కేసుపై స్పందించిన అధికారులు అనిల్ ను సస్పెండ్ చేశారు.

ఎస్సై అనిల్ సస్పెండ్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఎలాంటి విచారణ లేకుండా ఎంఐఎం ఒత్తిడి వల్లే అనిల్‌ను సస్పెండ్ చేశారని సంజయ్ ఆరోపించారు. ఆర్టీసీ బస్సు ఘర్షణ ఘటనలో జగిత్యాల ఎస్‌ఐ సస్పెన్షన్‌, ఆయన భార్యపై కేసులు పెట్టడాన్ని బండి సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. ఎస్సై అనిల్ సస్పెన్షన్‌కు నిరసనగా రేపు జగిత్యాల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. ఎస్‌ఐగా ఉన్న ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు చిన్నారులతో వేసవిలో బస్సులో ప్రయాణిస్తున్నాడంటే సదరు ఎస్‌ఐ ఎంత నిజాయితీపరుడో అర్థం చేసుకోవాలన్నారు. సిగ్గు లేకుండా సస్పెండ్ చేయడమే కాకుండా ఎస్ ఐ, అతని భార్య, కానిస్టేబుల్ పై కేసు పెట్టడం సిగ్గుచేటని సంజయ్ దుయ్యబట్టారు.

Show comments