NTV Telugu Site icon

Mayor Samala Buchi Reddy : తారాస్థాయికి చెత్త పంచాయితీ.. మేయర్ కు షోకాజ్ నోటీస్

Mayor Buchi Reddy Samala

Mayor Buchi Reddy Samala

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్లో చెత్త పంచాయితీ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తాకింది. విధి నిర్వహణలో మున్సిపాలిటీ కమిషనర్ పద్మజారాణి ఆదేశాలను, మున్సిపాలిటీ చట్టాలను బేఖాతర్ చేసిన బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామాల బుచ్చిరెడ్డికి , మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ షోకాజ్ నోటీస్లు జారీ చేసింది.

మేడ్చ‌ల్ లోని బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య సమస్య అద్వానంగా తయారైంది. కొంద‌రు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట రోడ్లపై చెత్తను ఇష్టానుసారంగా పడేసి పోతున్నారు. దీంతో.. 2022, మే 25న మేయర్ సామల బుచ్చి రెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో.. చెత్త సమస్య ప్రధానంగా చర్చకు వచ్చింది. పట్టణ ప్రగతిలో భాగంగా చెత్త రహిత బోడుప్పల్ గా తీర్చిదిద్దాలని.. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్న వారిపై భారీ జరిమానాలు విధించాలని కౌన్సిల్ స‌మావేశంలో తీర్మాణించారు.

అయితే.. కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలపై ప్రకటనలు కూడా ఇచ్చారు. దీంతో.. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే భారీ జరిమానాలు విధిస్తారని పలు పత్రికలలో ప్రధాన శీర్షికలో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేప‌థ్యంలో బోడుప్పల్ ఇన్ ఛార్జ్ కమీషనర్ పద్మజారాణి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే క్రమంలో జూన్ 4వ తేదీన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు. అయితే.. కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా చెత్తను తీసుకువచ్చి రోడ్లపై వేస్తున్న ఆరు వాహనాలను మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. ఒక్కొక్క‌ వాహనానికి రూ. 10 వేల జరిమానా వేయగా.. వారు చెల్లించడంతో వదిలిపెట్టారు. అయితే.. మిగతా 5 వాహనాలను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.

ఈనేప‌థ్యంలో.. జూన్ 5వ తేదీన మేయర్ ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. వ‌చ్చిరాగానే మున్సిపల్ ఉద్యోగులు స్వాధీనం చేసుకున్న వాహనాలను ఏలాంటి జరినామా తీసుకోకుండానే వదిలిపెట్టారు. దీంతో విషయం తెలుసుకున్న కమీషనర్ పద్మజారాణి ఇదేమిటీనీ మేయర్ బుచ్చిరెడ్డిని ప్రశ్నించారు. అయితే.. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల మేరకే మేమంతా అర్ధరాత్రి వరకు రోడ్లపై తిరుగుతూ, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని పట్టుకుంటే మీరు వచ్చి వదిలి పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీయ‌డంతో.. మేయర్ స్పందిస్తూ, చెత్త సేకరణ వాహనాలు వాళ్ల వద్దకు వెళ్లలేదని వారు బహిరంగ ప్రదేశాల్లో వేశారని చెబుతున్నారని పొంతన లేని సమాధానం చెప్పడంతో ఈ విషయాన్ని కమీషనర్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

కాగా.. విచారణ జరిపిన కలెక్టర్ డాక్టర్ హరీశ్ ఈ నెల 27వ తేదీన మేయర్ సామల బుచ్చిరెడ్డి కి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీంతో.. ఈ నెల 27వ తేదీన మేయర్ సామల బుచ్చిరెడ్డి కి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అయితే.. మున్సిపల్ అథారిటీ సీజ్ చేసిన వాహనాలను ఏలాంటి జరినామా తీసుకోకుండా ఎందుకు రిలీజ్ చేశారో 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీస్ పేర్కొన్నారు. లేకుంటే 2019 యాక్ట్ సెక్షన్ 23(2)ఏ, 23(2)బి ప్రకారం మున్సిపల్ సిబ్బంది విధులకు ఆటంకం కల్గించినందుకు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్. ఈ నేప‌థ్యంలో.. మేయర్ సామల బుచ్చిరెడ్డి, మంత్రి మల్లారెడ్డితో కలిసి వచ్చి కలెక్టర్ హరీశ్ తో.. సంజాయిషీ ఇచ్చుకున్నట్లు విశ్వ‌నీయ స‌మాచారం.

breaking: సీపీఎం కార్యాలయంపై బాంబుల దాడి.. కేరళలో టెన్షన్‌, టెన్షన్‌..!