GHMC Fingerprint Scam: గతంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, కాంట్రాక్టర్లు కలిసి.. లేని కార్మికుల్ని సైతం ఉన్నారని చూపుతూ కోట్ల రూపాయల్లో దండుకున్నారు. దానికి చెక్ పెట్టేందుకే సింథటిక్ ఫింగర్ ప్రింట్ వ్యవస్థని తీసుకొచ్చారు. అయినా మార్పు రాలేదు. నకిలీ ఫింగర్ ప్రింట్స్‌ని తయారు చేస్తూ, డబ్బులు దోచేస్తున్నట్టు తేలింది. జీహెచ్ఎంసీలో పని చేసే శానిటరీ ఇన్స్‌పెక్టర్లే ఈ అవినీతికి పాల్పడటం షాక్‌కి గురి చేసే విషయం. గతంలో కొందరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని విధుల నుంచి తొలగించినా.. పరిస్థితి మారలేదు. తాజాగా ఈ సింథటిక్ ఫింగర్ ప్రింట్ స్కామ్ వెలుగుచూసింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు శానిటరీ ఇన్స్‌పెక్టర్లను అరెస్ట్ చేశారు. గోషామహల్, మలక్‌పేట్ వన్ అండ్ టూకి చెందిన ఈ శానిటరీ ఇన్స్‌పెక్టర్ల నుంచి వేల సంఖ్యలో నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్స్‌ను స్వాధీనపరుచుకున్నారు. గోషామహల్ సర్కిల్ పరిధిలో ఎస్‌ఎఫ్ఏ వెంకట్ రెడ్డి విధులకు రాని కార్మికులకు సింథటిక్ వేలి ముద్రలతో హాజరు వేస్తున్నప్పుడు.. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నకిలీ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని విచారించగా.. ఉన్నతాధికారుల సూచన మేరకే తాను సింథటిక్ వేలిముద్రలు వినియోగించానని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అదే మాదిరిగా మలక్‌పేట్‌లోని వన్ అండ్ టూకు సంబంధించిన సానిటరీ ఇన్స్పెక్టర్స్‌ని సైతం అరెస్ట్ చేశారు. ఈ నకిలీ ఫింగర్ ప్రింట్ వ్యవహారంలో వెంకటరెడ్డి కీలకపాత్ర పోషించాడని ట్రాన్స్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
కాగా.. గ్రేటర్‌లో 18 వేల మందికిపైగా ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులున్నారు. చాలామంది కార్మికులు రాకపోయినా, వారి వచ్చినట్టు కాగితాల్లో చూపుతూ వేతనాలు కాజేయడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. గతంలో నిర్వహించిన తనిఖీల్లో 25 శాతం నుంచి 30 శాతానికిపైగా బోగస్ కార్మికులున్నట్టు గుర్తించారు. బయోమెట్రిక్ హాజరు విధానానికి శ్రీకారం చుట్టినా, ఇళ్లలో నుంచే హాజరు వేస్తున్నట్టు తేలడంతో మ్యాపింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ విధానం అమలుపరిచినా.. ఇందులోనూ స్కామ్ జరుగుతోంది. 2019లో మొత్తం ఈ స్కామ్‌లో భాగంగా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకే ఈ స్కామ్ జరుగుతున్నట్టు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అలాంటి స్కామ్ వెలుగుచూడటం కలకలం రేపింది.
