Shah Ghouse : మీరు బయట తినే బిర్యానీ నిజంగా ఎంత సురక్షితం? రుచి కోసం క్యూ కట్టే రెస్టారెంట్ల వంటగదుల్లో అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లపై తాజాగా నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ తనిఖీలు ఈ ప్రశ్నలకు ఆందోళన కలిగించే సమాధానాలను ఇచ్చాయి. వంటగదుల్లో ఈగలు, నిల్వ చేసిన పాత ఆహారం, గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్రమైన పరిసరాలు, లేబుళ్లు లేని ఆహార నిల్వలు, వంట నూనె వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి అనేక లోపాలు బయటపడటంతో ఆహార భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ బృందాలు జూన్ 27న గచ్చిబౌలిలోని షా ఘౌస్ హోటల్ అండ్ రెస్టారెంట్‌ను తనిఖీ చేశాయి. వంటగది మొత్తం ఈగలు తిరుగుతుండటం, గోడలు, నేలలపై పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము, మురికి, పరిశుభ్రత లేకుండా నిర్వహిస్తున్న మాంసం కటింగ్ ప్రాంతం అధికారులను ఆందోళనకు గురి చేసింది. ఆహార వ్యర్థాలతో నిండిన తెరిచి ఉన్న డ్రైన్లు, అపరిశుభ్రమైన వాషింగ్ ప్రాంతం, స్టోర్ రూమ్‌లో నీరు లీక్ అవడం కూడా గుర్తించారు. ముందుగా తయారు చేసిన కొన్ని ఆహార పదార్థాలపై లేబుళ్లు లేకపోవడం, తాగునీటి పరీక్షలకు సంబంధించిన రికార్డులు చూపించకపోవడం, వంటగది గోడలపై గుట్కా మరకలు కనిపించడం కూడా తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది.
హైటెక్ సిటీలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో వంటగది విస్తీర్ణం సరిపోకపోవడం, నేలపై నీరు, ఆహార అవశేషాలు ఉండటం, ఆహారాన్ని వర్గీకరించే విధానం పరిశుభ్రంగా లేకపోవడం గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో రుమాలి రోటీ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేశారు.
కొండాపూర్‌లోని పాలమూరు గ్రిల్ అండ్ బార్‌లో సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల లేబుళ్లలో మార్పులు చేసినట్లు అధికారులు గుర్తించారు. నిల్వలో ఉన్న పాత ఆహారం, గడువు ముగిసిన పుట్టగొడుగులను స్వాధీనం చేసుకుని పారవేశారు. వంటగదిలో ఈగలు తిరుగుతుండటం, పైకప్పులు, లైటింగ్ ఫిట్టింగ్స్‌పై మురికి పేరుకుపోవడం, తుప్పు పట్టిన ఫ్రీజర్‌లో నీరు నిల్వ ఉండటం వల్ల కలుషితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పాత్రలను వేడి నీటితో శుభ్రపరిచే విధానాన్ని పాటించడం లేదని, నీటి నాణ్యత పరీక్షల రికార్డులు కూడా అందుబాటులో లేవని వెల్లడించారు.
గాజులరామారంలోని విజయవాడ స్పెషల్ కృష్ణా కేఫేలో వంటగది కొంత భాగం బయటకు తెరిచి ఉండటం, ఆహారం తయారు చేసే ప్రాంతం పక్కనే మూతలు లేని చెత్త బుట్టలు పొంగిపొర్లుతూ ఈగలు చేరడం కనిపించింది. ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన పిండి, చట్నీ, తరిగిన కూరగాయలను మూతలు లేకుండా, లేబుళ్లు లేకుండా ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ముడి పదార్థాలను అస్తవ్యస్తంగా నిల్వ చేయడం, వాషింగ్ ప్రాంతం వద్ద నీరు నిల్వ ఉండటం, ఆహార తయారీలో ఉపయోగిస్తున్న ఇనుప కత్తులను స్వాధీనం చేసుకుని తొలగించారు.
మాదాపూర్‌లోని ఐడియల్ కిచెన్‌లో ఫ్రీజర్‌లలో కప్పకుండా ఉంచిన పిండి, సగం సిద్ధమైన ఆహార పదార్థాలపై చనిపోయిన బొద్దింకలు కనిపించాయి. నేలపై నీరు, ఆహార అవశేషాలు ఉండటంతో పాటు ముడి పదార్థాలను ప్యాలెట్లు లేకుండా నేరుగా నేలపై నిల్వ చేయడం వల్ల కలుషితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. నిల్వలో ఉన్న మినప్పప్పులో పురుగులు కూడా గుర్తించారు.
జే. విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహ ఫుడ్స్‌లో వంటగది బయట వాతావరణానికి తెరిచి ఉండటంతో దుమ్ము, పురుగులు సులభంగా లోపలికి వచ్చే పరిస్థితి కనిపించింది. వాడిన వంట నూనె నాణ్యతను అంచనా వేసే టోటల్ పోలార్ కంపౌండ్స్ పరీక్ష కోసం ఎలాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల అదే నూనెను పదేపదే ఉపయోగించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ముడి పదార్థాలను నేలపైనే నిల్వ చేయడం, వాషింగ్ ప్రాంతం వద్ద నీరు నిల్వ ఉండటం, ప్యాక్ చేసిన స్వీట్లు, కారాలపై తప్పనిసరి లేబుళ్లు లేకపోవడం బయటపడింది. స్టోర్ రూమ్‌లో సాలీడు గూళ్లు, దుమ్ము, తగినంత వెలుతురు లేకపోవడం, నీరు కారడం, ప్యాకింగ్ ప్రాంతం వద్ద ఎలుకల బొరియలు, నిల్వ చేసిన బెల్లంలో పురుగుల ఉనికి కూడా తనిఖీల్లో గుర్తించారు.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం ప్రతి ఆహార వ్యాపార సంస్థ పరిశుభ్రత, నిల్వ విధానాలు, సురక్షిత వంట ప్రక్రియలు తప్పనిసరిగా పాటించాలి. లేబుళ్లు లేకుండా ఆహారం నిల్వ చేయడం, గడువు ముగిసిన పదార్థాలు ఉపయోగించడం, అపరిశుభ్రమైన వంటగదులు నిర్వహించడం వల్ల ఆహారం కలుషితమై ఫుడ్ పాయిజనింగ్, జీర్ణ సంబంధిత వ్యాధులు, బ్యాక్టీరియా సంక్రమణ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే బయట భోజనం చేసే ముందు పరిశుభ్రతపై వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.
🚨 షా ఘౌస్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
📍 రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ ఎదురుగా ఉన్న షా ఘౌస్ రెస్టారెంట్‌లో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
తనిఖీల్లో.. వంటగది గోడలపై గుట్కా మరకలు
వంటగది అంతా ఈగలు
పరిశుభ్రత లోపం, గ్రీజ్, దుమ్ము పేరుకుపోవడం… pic.twitter.com/BsTlOqs4H1
— greatandhra (@greatandhranews) June 27, 2026

