NTV Telugu Site icon

Tollywood: టాలీవుడ్‌ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత

Tollywood

Tollywood

Tollywood: గత నాలుగు నెలలుగా వరుస విషాదాలు టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటులుగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, నవరసనాటన సార్వభౌమ కైకాల సత్య నారాయణ కన్నుమూశారు. మరో సీనియర్ నటుడు చలపతిరావు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. ఈ ఆదివారం (డిసెంబర్ 25) తెల్లవారుజామున గుండెపోటుతో చలపతిరావు తుదిశ్వాస విడిచారు. చలపతిరావు 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన గూఢచారి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి పన్నెండు వందలకు పైగా చిత్రాలలో అనేక విభిన్న పాత్రల్లో నటించారు. చలపతిరావు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన చలపతిరావు మృతి తెలుగు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో కృష్ణంరాజు ఈ ఏడాది కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన కృష్ణంరాజు సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణిస్తున్న కృష్ణంరాజు మృతి టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read also: Atal Bihari Vajpayee: “అటల్‌” మీకు “సలాం”..

తనదైన నటనతో, సాహసాలతో టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన నటశేఖర కృష్ణ ఈ ఏడాది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన నవంబర్ 15న మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేల సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ డిసెంబర్ 23న కన్నుమూశారు. యముడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన మరణం టాలీవుడ్ ను కుదిపేసింది. నిన్న డిసెంబర్ 24న ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే చలపతిరావు మృతిచెందిన వార్త టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఫలితంగా గత నాలుగు నెలల్లో నలుగురు దిగ్గజ నటులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇటీవల ఏవీఎస్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్ వంటి హాస్యనటులు నెలరోజుల్లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
Tsunami in Indonesia: ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..

Show comments