Site icon NTV Telugu

Ibrahimpatnam Firing Case: కాల్పుల కేసులో సంచలన విషయాలు

హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పుల వ్యవహారం సంచలనగా మారింది.. ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.. అయితే, ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రియల్టర్‌ శ్రీనివాస్ రెడ్డి చేసిన భూ సెటిల్‌మెంట్లే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు.. సెటిల్‌మెంట్లతో పాటు శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కూడా దృష్టి సారించారు పోలీసులు.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి… ఆస్తులన్నింటినీ కూడా హఫీజ్, నవీన్ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. దీంతో.. హఫీజ్, నవీన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్‌లోని అతిపెద్ద సిటీ రష్యా స్వాధీనం

పదుల సంఖ్యలో ఆస్తులను నవీన్, హఫీజ్ పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు శ్రీనివాస్ రెడ్డి.. ఇక, తుర్కయంజాల్ సమీపంలో ఇటీవల కాలంలో శ్రీనివాస్‌రెడ్డి పెద్ద సెటిల్‌మెంట్‌ చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ వ్యవహారంలో కూడా పెద్ద మొత్తంలో శ్రీనివాస్ రెడ్డికి డబ్బులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.. మరోవైపు, డబుల్ రిజిస్ట్రేషన్ అయిన భూములను శ్రీనివాసరెడ్డి స్వాధీనం చేసుకుని సెటిల్‌మెంట్లు చేస్తారని చెబుతున్నారు.. ఇతర ప్రాంతంలో జరిగిన సెటిల్‌మెంట్‌ వ్యవహారంలోనే శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇద్దరు ప్రాణాలను బలిగొన్న ఇబ్రహీంపట్నం కాల్పుల కేసుకు సంబంధించి మీడియా సంయమనం పాటించాలని కోరారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌ భగవత్.. కాల్పుల ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.. కేసు విచారణలో ఉంది.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా పురోగతి ఉంటే మీడియాకు చెబుతాం అన్నారు.. కాగా, మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు మట్టారెడ్డి, హఫీజ్, కృష్ణ సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version