సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నరసరావుపేట నుంచి వచ్చిన అభ్యర్థులే దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాయి ఢిపెన్స్ అకాడమీ అభ్యర్థులే ఎక్కువగా ఆందోళనలో పాల్గొన్నట్లు గుర్తించారు. గుంటూరుతో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ అభ్యర్థులు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రైలులో సాయి ఢిపెన్స్ అకాడమీకి చెందిన 450 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారు.
Read Also: KCR Press Meet: సాయంత్రం కేసీఆర్ ప్రెస్‌మీట్.. అగ్నిపథ్‌పై ఉద్యమం..!
కాగా.. నిన్న సికింద్రాబాద్ లో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు చేసినవిషయం తెలిసిందే. గాయపడిన వారిని గాందీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. గాంధీ ఆసుపత్రికి నిన్న 14 మంది క్షతగాత్రులు వచ్చారని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఐదుగురికి బుల్లెట్ గాయాలయ్యాయన్నారు. వారిలో ఒకరు చనిపోయారని వెల్లడించారు. మిగతా నలుగురికి సర్జరీ జరిగిందన్నారు.
ఒకరికి చెస్ట్ దగ్గర బుల్లెట్ గాయమవడంతో మేజర్ సర్జరీ జరిగిందన్నారు. మరొకరికి తొడ భాగంలో గాయమైతే సర్జరీ చేశామని రాజారావు తెలిపారు. మరొకరి కాలికి బుల్లెట్ గాయమవడంతో సర్జరీ జరిగిందన్నారు. చెస్ట్, తొడ వద్ద బుల్లెట్ గాయం అయినవారు కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. మిగతా 9 మందికి సాధారణ గాయాలయ్యాయన్నారు. రాళ్లు, కర్ర దెబ్బలు తగలడం, చర్మం లేవడం వంటి గాయాలయ్యాయన్నారు. 9 మందిని 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచామని.. ఆ తరవాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. కుటుంబ సభ్యులను ఒక్కొక్కరికి లోపలికి అనుమతి ఇస్తున్నామని రాజారావు తెలిపారు.
