Secunderabad Railway Police To File Chargesheet Soon: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రైల్వే పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 64 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే! అలాగే 400 మంది వాట్సాప్ గ్రూప్ సభ్యుల వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. 63 స్మార్ట్‌ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డివిజన్ (FSL)కు పంపించారు. కాగా.. ఈ కేసులో సుబ్బారావును పోలీసులు ఏ64 నిందితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే! విధ్వంసకారులకు భోజనాలు, వసతి ఏర్పాటు చేశాడని.. వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థులను రెచ్చగొట్టినట్లు ఆధారాలున్నాయని పోలీసులు చెప్తున్నారు. అలాగే.. నిందితులతో వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు మాట్లాడిన ఆడియోలు ఉన్నట్టు తెలిపారు. వాటినే ఫోరెన్సిక్‌కి పంపారు.
అటు.. వాట్సాప్‌లో రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్, చలో సికింద్రాబాద్ ARO3, ఆర్మీ GD2021 మార్చ్ ర్యాలీ, CEE సోల్జర్ గ్రూపులను అభ్యర్థులు క్రియేట్ చేశారని.. ఆ గ్రూపుల ద్వారానే రైల్వేస్టేషన్లలో విధ్వంసానికి ప్లాన్ చేశారని పోలీసులు ఇప్పటికే తేల్చారు. మరోవైపు.. ఈ కేసులో ఏ12 నిందితుడిగా ఉన్న పృథ్విరాజ్ అనే వ్యక్తి.. రైల్వే ఆస్తులు, బోగీలకు కేసులో నిప్పు పెట్టినట్లు వీడియో ఫుటేజీలు లీకవ్వగా, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్యాసింజర్ బోగీలోకి వెళ్లి మరీ పృథ్విరాజ్ నిప్పు పెట్టడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోల్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం గమనార్హం. ఇదిలావుండగా.. సుబ్బారావు మాత్రం తనకు ఈ కేసుతో సంబంధం లేదని, తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపిస్తూ.. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే!