NTV Telugu Site icon

TS Schools: నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ బంద్..! ABVP పిలుపు..?

Telangana Scholl

Telangana Scholl

TS Schools: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఏబీవీపీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ‘మన ఊరు మన బడి’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికీ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫారాలు అందలేదని, నిర్వహణ నిధులు కూడా ఇవ్వలేదన్నారు.

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, డొనేషన్లు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఏబీవీపీ నాయకులు నిరసన తెలిసిందే.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లొంగిపోయి ఎన్నికల నిధులకు అమ్ముడుపోయిందన్నారు.

Read also: Blast in Kuppam: కుప్పంలో భారీ పేలుడు

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నాయని.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వెంటనే అందించాలి. విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న డీఎస్సీ, ఎంఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి. పాఠశాలలు తెరిచి 20 రోజులు కావస్తున్నా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదని, చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేవన్నారు. ప్రయివేటు పాఠశాలల్లో సరైన ఫీజు విధానం అమలు చేసేందుకు ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సోమవారం జరిగే రాష్ట్ర వ్యాప్త పాఠశాలల సమ్మెకు విద్యార్థులు, తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని కోరారు.

Astrology: జూన్‌ 26, సోమవారం దినఫలాలు