Telangana: ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ విద్యార్థులు.. బడిలోనే బ్యాంకు ఏర్పాటు సాధారణంగా బ్యాంకులు రోజులో ఆరేడు గంటలు పనిచేస్తుంటాయి. కానీ ఈ బ్యాంక్ మాత్రం అరగంటే పనిచేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా.. ఇది బడిలోని బ్యాంక్. ఇక్కడ స్కూల్ విద్యార్థులే ఉద్యోగులు. వాళ్లే ఇక్కడ బ్యాంక్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్, క్లర్క్. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయుల చొరవతో బడిలోనే బ్యాంక్ ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన నగదును ఇందులో దాచుకుంటున్నారు. అవసరమైనప్పుడు ఈ బ్యాంకులో దాచుకున్న నగదు తీసుకుంటారు.
ఈ బ్యాంకు పేరు స్కూల్ బ్యాంకు ఆఫ్ చిల్పూర్. ఈ బ్యాంకు పెట్టాలన్న ఆలోచన 8వ తరగతిలో మనీ అండ్ బ్యాంకింగ్ గురించి పాఠం చెప్తుండగా దుడికే వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడికి కలిగింది. బ్యాంకు కార్యకలాపాల గురించి విద్యార్థులకు సవివరంగా చెప్పాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయుడికి బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కలిగింది. దీంతో ప్రధానోపాధ్యాయురాలు లీల, ఇతర టీచర్లతో చర్చించి ఆయన బ్యాంకు ఏర్పాటు చేశారు. బ్యాంకు లావాదేవీలు ఎలా నిర్వహించాలో విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. డబ్బులు దాచుకునే ప్రతి విద్యార్థికి గుర్తింపు కార్డుతో కూడిన పాస్ పుస్తకం ఇచ్చారు.
Read Also: Andhra Pradesh: దివిసీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్లు
ఇప్పటివరకు స్కూలులో చదువుకునే 158 మంది విద్యార్థులు పొదుపు ఖాతాలను ప్రారంభించారు. పే ఇన్ స్లిప్, విత్ డ్రాయల్ ఫారాలను ఉపాధ్యాయుడు దుడికే వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా ముద్రించడం విశేషం. అయితే ఈ బ్యాంక్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అరగంట చొప్పున తెరిచి ఉంటుంది. కాగా రూ.3వేలకు పైగా నగదు జమ అయితే చిల్పూర్ పోస్టాఫీసులోని పొదుపు ఖాతాలో భద్రపరుస్తామని హెచ్ఎం లీలా తెలిపారు.