Sabitha Indra Reddy On Governor Tamilisai Letter: పెండింగ్ బిల్లుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. గవర్నర్ తమిళిసై రాసిన లేఖపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలుత తమకు యూనివర్శిటీ బిల్లు విషయంలో ఎలాంటి సమాచారమూ అందలేదన్న మంత్రి సబితా.. ఈరోజు తమకు లేఖ అందిందని స్పష్టం చేశారు. తెలంగాణలోని యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ తమిళిసై సందేహాల్ని తాము నివృత్తి చేస్తామని, న్యాయపరమైన అంశాలను వివరిస్తామని తెలిపారు. తాము అపాయింట్‌మెంట్ కోరామని, ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. అపాయింట్‌మెంట్ ఖరారు అవ్వగానే, వెళ్లి గవర్నర్‌ను కలుస్తామని స్పష్టం చేశారు. అలాగే తాను నిజాం కళాశాల హాస్టల్ వివాదంపై ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, నిజాం కాలేజీ ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్నానని.. కాలేజీలో చదువుతున్న అమ్మాయిలను పిలిచి మాట్లాడి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
కాగా.. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై, వాటిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆమె లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌కు వచ్చి వాటిపై చర్చించాలని సూచించారు. ఈ పెండింగ్ బిల్లు విషయంపై తమ అభిప్రాయం కూడా తెలపాల్సిందిగా యూజీసీకి కూడా ఆమె లేఖ రాశారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్‌మెంట్ చెల్లుబాటు అవుతుందా? అని కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే.. ఈ లేఖ తమకు అందలేదని మంగళవారం మంత్రి సబితా చెప్పడంతో, తాము సోమవారమే మెసేంజర్ ద్వారా సమాచారం ఇచ్చామని ఆ వెంటనే రాజ్‌భవన్ వర్గాలు స్పందించాయి. ఇప్పుడు తమకు లేఖ అందిందని సబితా తెలపడంతో.. వ్యవహారం చల్లారింది.