NTV Telugu Site icon

Telangana Rtc: మళ్ళీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. ప్రయాణికులు కస్సు..బస్సు

Bus

Bus

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రయాణికుల బస్‌పాస్‌లపై పెను ప్రభావం చూపింది. ఆర్టీసీ పిడుగుపాటులా పెంచిన చార్జీలతో ప్రయాణికులపై అశనిపాతమే అయింది. కోవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆఫ్‌లైన్‌ చదువులతో ఢక్కామొక్కీలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితులతో స్కూళ్లు, కాలేజీలకు, ఉద్యోగాలకు వెలుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్‌ చార్జీలు గ్రేటర్‌లోని లక్షలాది మంది ప్రయాణికులు బెంబేలెత్తిస్తున్నాయి.

ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల పాటు ప్రయాణం చేసినవారు.. ఇక నుంచి ఏకంగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా బస్‌పాస్‌ చార్జీలను పెంచడంతో పాటు రెండు దశాబ్దాల క్రితం నాటి రాయితీలను కూడా సవరించడంతో భారం రెండింతలైంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రయాణికులకు ఆర్టీసీ చార్జీలే గుదిబండగా మారాయి. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్‌ రాయితీల నుంచి ఆర్టీసీ క్రమంగా తప్పుకొనేందుకే ఈ భారాన్ని మోపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం పట్ల విద్యార్ధి, ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు నెలవారీ, మూడు నెలల సాధారణ బస్‌పాస్‌లతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పాస్‌లు,రూట్‌ పాస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లా బస్సుల్లో నగర శివార్ల వరకు అనుమతించే బస్‌పాస్‌లు కూడా ఉన్నాయి. మూడు నెలల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్‌ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు పెరిగింది. ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీసుకొనే రూట్‌పాస్‌లు 8 కిలోమీటర్ల వరకు రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.600కు పెంచారు.

అయితే బ‌స్సు చార్జీల‌క‌న్నా ఆటో చార్జీలే నయం అంటూ ప్ర‌యాణికులు అంటున్నారు. కొంత‌దూరంలో వున్నా ఆర్టీసీ టికెట్ ధ‌ర‌లు 30 నుంచి 45 వుంటున్నాయ‌ని స‌మాచారం. కాగా.. అదే ఆటో చార్జీలైతే 25 నుంచి వ‌సూలు చేస్తున్నాని ప్ర‌యాణికులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణాల‌కు ఇబ్బంది క‌లిగించ‌కుండా ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను వెంట‌నే తగ్గించాల‌ని ప్ర‌యాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Etala Rajender: నిందితుల్ని పట్టుకోవడంలో ఘోర వైఫల్యం