ఔను.. వాళ్లిద్దరూ కలిశారు..! అదీ రహస్యంగా..!! తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ సీక్రెట్ భేటీపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదట్లో ఉప్పు-నిప్పుగా ఉన్న నాయకులు.. ఒక్కసారిగా హస్తినలో రహస్యంగా సమావేశమై ఏం మాట్లాడుకున్నారు? ఆ బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తోన్న గుసగుసలేంటి? ఎవరు వారు?
ఢిల్లీలో రేవంత్, ఉత్తమ్ గంటపాటు రహస్య భేటీ?
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఎవరు ఎప్పుడు కలిసి ఉంటారో.. ఎప్పుడు కయ్యాలు పెట్టుకుంటారో తెలియదు. ఇద్దరు కీలక నాయకుల మధ్య తాజా జరిగిన పంచాయితీ ఆ కోవలోకే చేరింది. ఢిల్లీలో వారిద్దరూ రహస్యంగా సమావేశమైనట్టు తెలిసి.. పార్టీ వర్గాల్లో చర్చగా మారారు. వారెవరో కాదు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న వ్యవహారాలపై ఇద్దరూ అత్యంత రహస్యంగా.. సీరియస్‌గా చర్చించారట. గంటకుపైగా ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అయితే వారి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటి? ఏం మాట్లాడుకున్నారు? పాత గొడవలు పక్కనపెట్టి కలిసిపోయారా? మనస్పర్థలు వదిలేశారా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పడ్డారు కాంగ్రెస్ నాయకులు.
Read Also : ‘ఫరాజ్’… జూలై 1, 2016… ‘ఆ రాత్రి’ ఏం జరిగింది?
మహేశ్వర్‌రెడ్డితో కీచులాటపై ఉత్తమ్‌ను నిలదీసిన రేవంత్?
పీసీసీకి కొత్త కమిటీ వచ్చాక.. రేవంత్, ఉత్తమ్‌ల మధ్య ఉన్న అంతర్గత కలహాల కారణంగా ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి ఇంత టైమ్ పట్టింది. పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు తనపై సోషల్ మీడియాలో రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేయించారని ఉత్తమ్‌కు అనుమానం ఉందట. అలా చేయాల్సిన పని నాకేంటన్నది రేవంత్ ప్రశ్న. ఈ క్రమంలోనే నాయకుల మధ్య గ్యాప్ వచ్చింది. రేవంత్ పగ్గాలు చేపట్టాక పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ మీటింగ్‌లో రేవంత్, మహేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో వాగ్యుద్ధానికి దిగారు. మహేశ్వర్‌రెడ్డి వెనక ఉత్తమ్ ఉన్నట్టు పీసీసీ చీఫ్ అనుమానిస్తున్నారట. ఢిల్లీ ఉత్తమ్, రేవంత్‌ల రహస్య సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. మహేశ్వర్‌రెడ్డి విషయంపై నేరుగానే ఉత్తమ్‌ను ప్రశ్నించారట రేవంత్. కలిసి పనిచేయాలని అనుకున్నప్పుడు సమావేశంలో గొడవ పడటం దేనికి? అతను మీ మనిషి అని మాజీ చీఫ్‌ను నిలదీసినట్టు సమాచారం.
కాస్త ఓపిగా ఉండాలని రేవంత్‌కు ఉత్తమ్ హితవు!
సీక్రెట్ మీటింగ్‌లో రేవంత్ ప్రస్తావించిన అంశాలను విన్న తర్వాత ఉత్తమ్ గట్టిగానే బదులిచ్చినట్టు చెబుతున్నారు. మహేశ్వర్‌రెడ్డి వ్యవహారంలో నాకేం సంబంధం? నువ్వు కూడా కాస్త ఓపిగా ఉండాలి! అని రేవంత్‌కు హితవు పలికారట. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల కంటే.. గంట భేటీలో ఎక్కువ టైమ్.. PACలో జరిగిన గొడవ చుట్టూనే చర్చ సాగిందట. చివరకు పార్టీ వ్యవహారాలపై కలిసి పనిచేద్దామని ఉత్తమ్‌ను కోరారట రేవంత్. ఈ విషయాలు బయటకు పొక్కిన తర్వాత పార్టీ వర్గాల్లో ఒక్కటే చర్చ. అయితే రహస్య భేటీ తర్వాత ఇద్దరు కలిసి పనిచేస్తారా? లేక ఆధిపత్య పోరు కొనసాగుతుందా అన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
