NTV Telugu Site icon

Jagga Reddy Issue: రంగంలోకి రేవంత్‌రెడ్డి.. దొరకని జగ్గారెడ్డి..!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుడ్‌బై చెప్పడం దాదాపు ఖరారు అయినట్టే కనిపిస్తోంది.. సీనియర్లు చెప్పడంతో 3-4 రోజులు ఆగానని.. ఆగినంత మాత్రన వెనక్కి తగ్గేదిలేదని రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.. ఏ పార్టీలో చేరను.. స్వతంత్రంగానే ఉంటా.. రాజకీయా పార్టీ కూడా పెడతానంటూ ప్రకటించారు జగ్గారెడ్డి… అయితే, ఇప్పటికే చాలా మంది రంగంలోకి దిగిన జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్‌, దామోదర రాజనర్సింహా, గీతారెడ్డి.. ఇలా చాలా మంది ఫోన్లు చేసి.. ఆయనను వారించే ప్రయత్నం చేశారు.. కొందరు డైరెక్ట్‌గా చర్చలు జరిపారు. ఇక, చివరకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా రంగంలోకి దిగారు.. రేవంత్‌రెడ్డినే టార్గెట్‌ చేయడం.. ఆయనపైనే విమర్శలు గుప్పిస్తున్న నేతను ఒప్పించే ప్రయత్నం మొదలు పెట్టారు..

Read Also: EC: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఈసీ సీరియస్‌.. కేసు నమోదుకు ఆదేశాలు

జగ్గారెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి… కానీ, జగ్గారెడ్డి అందుబాటులోకి రానట్టుగా తెలుస్తోంది.. ఇక, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నిర్మలా జగ్గారెడ్డితో కూడా రేవంత్‌రెడ్డి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది.. జగ్గారెడ్డి అందుబాటులోకి రాకపోవడంతో.. ఆయన ఫోన్‌కు రేవంత్‌ రెడ్డి మెసేస్‌ పెట్టినట్టుగా చెబుతున్నారు.. మరి, జగ్గారెడ్డి ఎలా రియాక్ట్‌ అవుతారు? అనేది ఆసక్తికంగా మారింది. మరోవైపు.. జగ్గారెడ్డి అంశాన్ని మా కుటుంబ సమస్యగా అభిప్రాయపడిన రేవంత్‌రెడ్డి.. కుటుంబం అన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయని.. మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామని వెల్లడించారు.. ఇక, దీనిని మీడియా పెద్దగా చూపాల్సిన అవసరం లేదన్న ఆయన.. గోతికాడ నక్కల్లాగా చూసే టీఆర్‌ఎస్ పార్టీ ఆటలు సాగవని స్పష్టం చేశారు.. మీడియాలో రాస్తుంటారుగా టీ కప్పులో తుఫాన్‌ అంటూ.. జగ్గారెడ్డి వ్యవహారం కూడా అలాగే సమసిపోతుందని పేర్కొన్న విషయం తెలిసిందే.