Site icon NTV Telugu

CM Revanth Reddy : వైఎస్సార్ స్ఫూర్తితోనే మా పాలన.. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి స్మారక అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయన పాలన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. స్నేహానికి, పాలనకు వైఎస్సార్ ఒక నిలువుటద్దమని, ఆయన ఆశయాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

“అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది మిత్రులుగా మన చుట్టూ చేరతారు. కానీ అధికారం పోగానే ఆ మిత్రులు కూడా మాయమైపోతారు. అయితే, వైఎస్సార్-కేవీపీల స్నేహం అలాంటిది కాదు. విద్యార్థి దశ నుంచి వైఎస్సార్ మరణం వరకు కేవీపీ ఆయనకు తోడుగా నిలిచారు. ఇప్పటికీ వైఎస్సార్ ఆలోచనలనే కేవీపీ కొనసాగిస్తున్నారు,” అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.

“నేను సీఎం అయ్యాక వారానికి ఒకరిద్దరు నన్ను కలిసి, ‘అన్నా, నేను మీకు కేవీపీలా పనిచేస్తా, అన్నీ నేనే చూసుకుంటా’ అని చెబుతుంటారు. నేను వారికి ఒకటే చెప్పాను.. ఈ తరానికి వైఎస్ ఒక్కరే ఉంటారు.. కేవీపీ కూడా ఒక్కరే ఉంటారు. ఎవరూ కేవీపీ కాలేరు. అందుకు సర్వం వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వైఎస్సార్ సైతం తనపై వచ్చిన తప్పిదాలను తన ఖాతాలో వేసుకొని, జరిగిన మేలును కేవీపీ ఖాతాలో వేసే గొప్ప మనసున్న వ్యక్తి,” అని రేవంత్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు.

Election Commission : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

వైఎస్సార్ రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, ముఖ్యమంత్రులు మారినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను మార్చే సాహసం కూడా చేయలేని విధంగా వాటిని తీర్చిదిద్దారని సీఎం అన్నారు. “వైఎస్సార్ స్ఫూర్తితోనే మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నామంటే, ఆ స్ఫూర్తి కూడా వైఎస్సార్‌దే,” అని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, “ఆనాడు ‘వరి వేసుకుంటే ఉరి’ అన్నారు. కానీ మేము ‘వరి వేసుకోండి, మేమే కొంటాం’ అని చెప్పి బోనస్ కూడా ఇస్తున్నాం,” అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవసరమైనంత యూరియాను కేటాయించలేదని ఆరోపించిన రేవంత్ రెడ్డి, దీనికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. “రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి. దీనిపై మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క దృష్టి సారించి, ప్రభుత్వ పరంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి,” అని ఆదేశించారు.

నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, “నేను ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గురించి మాట్లాడను. కానీ వైఎస్సార్ కలలుగన్న తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఆయన ఆలోచన ప్రకారమే నిర్మించి తీరుతాం. దాన్ని గత పాలకులు మార్చారు, మేము దాన్ని సరిదిద్దుతాం,” అని హామీ ఇచ్చారు. “నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దాన్ని పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది,” అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Women Empowerment: గుడ్ న్యూస్.. ప్రతి మహిళకు రూ.10 వేలు.. సక్సెస్ అయితే రూ.2 లక్షలు.. ఎక్కడంటే

Exit mobile version