ప్రధాన ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కనుసన్నల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల ప్రక్రియ సాగుతోందని ఆరోపించారు. సీఈసీ (CEC) ఎంపిక చట్టంలో అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి (CJI) స్థానాన్ని తొలగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని విమర్శించారు. ముఖ్యంగా జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిని తప్పుబట్టిన ఆయన, పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన , ఓట్ల తొలగింపు ఎక్కడ జరుగుతుందో అక్కడే బీజేపీ లబ్ధి పొందుతోందని ఆరోపించారు.
జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎందుకు తగ్గుతున్నాయి?
గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా నమోదైన ఓటర్ల గణాంకాలను రేవంత్ రెడ్డి ఉదహరించారు. 2014 నాటికి దేశంలో 81 కోట్ల ఓట్లు ఉండగా, 2019 నాటికి అవి 91 కోట్లకు, అలాగే 2023 నాటికి 97 కోట్లకు చేరాయని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ఏకంగా 13 కోట్ల ఓట్లను నిబంధనల పేరుతో తొలగించారని మండిపడ్డారు. దేశంలో జనాభా క్రమంగా పెరుగుతున్నప్పుడు ఓట్లు ఎలా తగ్గుతాయని ఆయన కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ భారీ వైఫల్యానికి, కుట్రపూరిత ఓట్ల తొలగింపునకు ఎవరు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం లేదా రాష్ట్రపతి స్పందించకపోవడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
పౌరులను రెండు వర్గాలుగా విభజిస్తున్న బీజేపీ.. సంక్షేమ పథకాలకు కోత
దేశ ప్రజలను బీజేపీ ప్రభుత్వం రెండు రకాలుగా విభజిస్తోందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉండే వారిని ఒక వర్గంగా, వ్యతిరేకంగా భావించే వారిని ఓట్లు లేనివారిగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పౌరుల ఓటు హక్కును రద్దు చేయడం ద్వారా వారికి అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా నిలిపివేసే ప్రమాదకర పరిస్థితిని సృష్టిస్తున్నారని అన్నారు. దేశంలో శాశ్వత విభజన రేఖలను సృష్టించేలా కేంద్రం వ్యవహరిస్తోందని, దీనికి వ్యతిరేకంగా దేశంలో మరో స్తవాత్య్ర పోరాటం లాంటి ఉద్యమం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
జ్ఞానేష్ గో బ్యాక్ ఉద్యమం.. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం
ప్రజల ప్రాథమిక హక్కులను, ఓటు హక్కును హరించే చర్యలకు వ్యతిరేకంగా ‘జ్ఞానేష్ గో బ్యాక్’ పేరుతో ఆందోళనలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవడానికి దేశ ప్రజలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విధానాన్ని అణచివేయాలని చూసే శక్తులను ఐక్యంగా తిప్పికొట్టాలని, లేదంటే భవిష్యత్తులో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

