Site icon NTV Telugu

Revanth reddy: సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లపై ట్వీట్

Revanth

Revanth

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈ రోజు ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న సోనియా గాంధీని, 5న రాహుల్ గాంధీని హాజరుకావాల్సిందిగా కోరింది. ఈ కేసులో వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనుంది ఈడీ. అయితే ఈడీ సమన్లపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీల వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శిస్తున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా నెహ్రూ తీసుకువచ్చిన పేపర్ పై బీజేపీ ఈడీతో దాడులు చేయిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కీసర వేదికగా తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు ఈడీ నోటీసులపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది నీచమైన ప్రతీకార రాజకీయాలకు ఉదాహరణ అని.. దీన్ని ఖండిస్తున్నానని.. మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం ఉండీ, ఎంపీలు ఉన్నప్పటీకి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతోందని.. వారు తమ పాలనను కాపాడుకోవడానికి ఈడీపై ఆధారపడుతున్నారని.. తిరిగి పోరాడుతాం’’ అంటూ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.

2013లో సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ కేసు కొనసాగుతోంది. నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈడీ సమన్లతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశం అయింది. తాజాగా సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు రావడంతో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఇంతకుముందు కాంగ్రెస్ నేత ఎంపీ మల్లిఖార్జున ఖర్గేను కూడా ఈడీ విచారించింది.

Exit mobile version