CM Revanth Reddy: న్యూఢిల్లీలో ‘ప్రతిదిన్ మీడియా నెట్‌వర్క్, అస్సాం’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది కాన్‌క్లేవ్ 2026’ (The Conclave 2026) కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్య, సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేసిన ఆయన.. ప్రస్తుత కాలంలో నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారాన్ని (న్యూట్రిషన్) అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్య వల్ల కలిగే మార్పునకు బి.ఆర్. అంబేద్కర్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంల జీవితాలే నిదర్శనమని, వారు చదువుకోవడం వల్లే ఉన్నత స్థానాలకు ఎదిగారని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సీఎం పునరుద్ఘాటించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు.
‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’తో గ్లోబల్ అవకాశాలు..
యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామని, దీనికి పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను బోర్డ్ చైర్మన్‌గా నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATC) అప్‌గ్రేడ్ చేసి, టాటా గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుని శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో బ్లూకాల్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉండబోతోందని, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా వంటి దేశాల్లో యువతకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. అక్కడి అవకాశాలను అందుకోవడానికి వీలుగా విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు.
గుజరాత్ వర్సెస్ దేశం.. ప్రధాని మోదీ వైఖరిపై తీవ్ర ధ్వజం
నాడు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అభివృద్ధికి ఎంతో సహకరించారని, కానీ నేడు ప్రధాని మోదీ మాత్రం తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డు (RRR) టెండర్లు పిలిచే సమయానికి కేంద్రం అనుమతులను అడ్డుకుందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితి నార్త్ వర్సెస్ సౌత్ లా లేదని, ‘గుజరాత్ వర్సెస్ మొత్తం దేశం’ అన్నట్లుగా మారిందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ.. దేశ నిధులను మాత్రం గుజరాత్‌కే తరలించుకుపోతున్నారని ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన స్థానాలు పెంచితే పెద్ద రాష్ట్రాలకు లబ్ధి చేకూరి, చిన్న రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓట్ల తొలగింపుపై ఆగ్రహం.. ‘SIR గో బ్యాక్’ అని నినదిద్దాం
రాజకీయాలను ప్రస్తావిస్తూ.. తాము ‘హరహర మహాదేవ్’ అని అంటే బీజేపీకి నచ్చడం లేదని, వారు కేవలం ‘జై శ్రీరామ్’ అనడానికే ప్రాధాన్యమిస్తున్నారని సీఎం అన్నారు. కాంగ్రెస్ పేదల వైపు ఉంటే, బీజేపీ సంపన్నుల పక్షాన నిలిచిందని ఎద్దేవా చేశారు. పేదల ఓటు హక్కును కాలరాసేందుకే ‘SIR’ను తీసుకొచ్చారని, నాడు బ్రిటీషర్లు సైమన్ కమిషన్‌ను తీసుకొచ్చినట్లే నేడు మోదీ ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటున్నారని ఆరోపించారు. 2029 ఎన్నికల కోసం దేశంలో ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారని, జనాభా తగ్గకుండా ఓట్లు మాత్రమే ఎలా తగ్గుతాయని ప్రశ్నించారు. ప్రధానికి వ్యతిరేకంగా ఉన్న దాదాపు 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అన్ని అధికారాలను ఢిల్లీలోని ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌కే కట్టబెడితే బీఎల్‌ఓలు, కలెక్టర్లు ఎందుకని నిలదీశారు. నాడు ‘సైమన్ గో బ్యాక్’ అన్నట్లే నేడు ‘SIR గో బ్యాక్’ అని నినదిస్తూ దేశమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
