CM Revanth Reddy : హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ (MCRHRD) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీజీ20 (TG20) లీగ్ విజేత ‘హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్’ జట్టు మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన క్రీడాకారులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించి, వారికి నగదు బహుమతుల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి.. తెలంగాణలో క్రీడల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వ విజన్‌ను పంచుకున్నారు.
క్రీడలపై స్పష్టమైన పాలసీ.. ప్రతిభావంతులకు ప్రభుత్వ ఉద్యోగాలు
క్రీడా రంగంపై తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ఒక స్పష్టమైన దృక్పథం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పుడు జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ ప్రధాన వేదికగా నిలిచిందని గుర్తుచేసిన ఆయన, ఆ వైభవాన్ని మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రానికి ఒక సమగ్రమైన ‘స్పోర్ట్స్ పాలసీ’ని తీసుకువచ్చామని వెల్లడించారు. క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాణించిన క్రీడాకారులను కేవలం క్యాష్ రివార్డులతోనే సరిపెట్టకుండా, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం.. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు
రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి క్రీడా ప్రాంగణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేయబోతున్నామని వెల్లడించారు. “ఏ రంగంలోనైనా సరైన ఫోకస్ లేకపోతే రాణించలేం. మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా దానిపై గౌరవంతో పాటు, ఆసక్తితో ముందుకు సాగాలి” అని క్రీడాకారులకు హితవు పలికారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాగున్న ప్రతిభను వెలికితీసేందుకు టీజీ20 లీగ్ ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడిందని అభినందించారు. ఇక్కడ విజయం సాధించిన క్రీడాకారులంతా భవిష్యత్తులో దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.

