Site icon NTV Telugu

Revanth Reddy: వినాశకాలే విపరీత బుద్ధి.. కేసీఆర్ కుట్ర చేస్తున్నారు

Revanth Fires On Kcr

Revanth Fires On Kcr

Revanth Reddy Sensational Comments On KCR After BRS Announce: దసరా సందర్భంగా జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ప్రకటించిన సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టడం ఓ దుర్మార్గపు ఆలోచన అని విమర్శించిన ఆయన.. కేసీఆర్‌కు తెలంగాణలో పోటీ చేయడానికి అర్హత లేదని ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలకు, కేసీఆర్‌కు ఋణం తీరిపోయిందని.. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని అన్నారు. 2001 నుండి 2022 వరకు కేసీఆర్ ఆర్ధికంగా బలోపేతమయ్యారని పేర్కొన్నారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈ కొత్త పార్టీ తెచ్చారన్న ఆయన.. రేపు ప్రపంచ రాష్ట్ర సమితి అని పేరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు.

వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కేసీఆర్ వ్యవహారం ఉందని.. కేవలం కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశతోనే ఆయన జాతీయ పార్టీ పెట్టారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ’ పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. ఆయన ఆ పదాన్ని పూర్తిగా చంపేయాలనుకుంటున్నారని తూర్పారపట్టారు. అయితే.. తెలంగాణ ప్రజల జీవనంలో ‘తెలంగాణ’ అనే పదం ఓ భాగమని, తెలంగాణ హంతకుడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. మరో 12 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిపోయిందని అన్నారు.

ఇదిలావుండగా.. నవంబర్‌లో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చిన ఆ పార్టీ.. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. ప్రజల్ని ఆకర్షించేందుకు తమదైన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మరోవైపు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సహా, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతల సమక్షంలో.. టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ప్రకటన చేశారు.

Exit mobile version