ఢిల్లీలో నిర్వహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న ఆయన, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే వైఎస్‌ఆర్‌కు అర్పించే అత్యున్నత నివాళి అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకుల చారిత్రక సంస్కరణలు
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్యా, నీటిపారుదల రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, ఆయన ముందుచూపు వల్లే దేశం ఆకలి కేకల నుంచి ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని సీఎం కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అగ్రికల్చర్ యాక్ట్ తెచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంపకం చేయడమే కాకుండా, రైతుల పంటలకు మద్దతు ధరను తీసుకొచ్చిన ఘనత సాధించారన్నారు. అలాగే సోనియా గాంధీ తెచ్చిన ఆహార భద్రత చట్టం, కాంగ్రెస్ హయాంలో వచ్చిన పీడీఎస్ (PDS) రేషన్ వ్యవస్థ వల్లే నేడు తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి సాంబ బియ్యం అందించగలుగుతున్నామని గుర్తుచేశారు.
రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు రూ. 1,300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేసి, రైతులపై ఉన్న కేసులను ఎత్తివేసి వారి గుండెల్లో రారాజుగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రాంతంలో సాగునీరు అందించేందుకు ప్రాణహిత-చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్‌ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టులను ప్రారంభించింది వైఎస్‌ఆరేనని చెప్పారు. ఆనాడు ఆగిపోయిన ప్రాణహిత-చేవెళ్ల, ఎస్‌ఎల్బీసీ, కల్వకుర్తి ప్రాజెక్టులను నూటికి నూరు శాతం పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్సార్ చివరి కోరిక నెరవేరుద్దాం
వైఎస్ అభిమానులకు ఒక చారిత్రక సత్యాన్ని గుర్తుచేస్తున్నానంటూ సీఎం స్పష్టం చేశారు. రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే తన జీవిత లక్ష్యమని వైఎస్సార్ స్పష్టంగా చెప్పారని, కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారని, ఈ చారిత్రక సందర్భంలో దేశానికి రాహుల్ గాంధీ వంటి బలమైన నాయకుడి అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో మనమంతా కలిసికట్టుగా శ్రమించి, రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసి వైఎస్సార్ ఆఖరి కోరికను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.

