తెలంగాణ ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీలను ఉద్దేశించి ఆయన తీవ్రమైన బాధ్యతారాహిత్యం, అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలనే హెచ్చరికలతో పాటు పలు కీలక సూచనలు చేశారు. పోలీసు శాఖలోకి ఏ ఆశయంతో జాయిన్ అయ్యారో ఆ లక్ష్యాన్ని ఎప్పటికీ మరవకూడదని, నిబద్ధతతో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర దిశ మీ చేతుల్లోనే ఉంది
రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల దిశ ఏ మార్గంలో నడవాలనేది క్షేత్రస్థాయిలో పనిచేసే డీఎస్పీల చేతుల్లోనే ఉందన్నారు. “మీపై పర్యవేక్షణ చేసే సీనియర్లు ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశం ఉండదు. క్షేత్రస్థాయిలో మీరు తీసుకునే నిర్ణయాలే అత్యంత కీలకం. మీ నుంచి ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి ఓట్లు వేయమని మేం ఎప్పుడూ అడగం. మీ విధులను నిర్భయంగా, బాధ్యతాయుతంగా నిర్వహించండి. పదిమంది డీఎస్పీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది, అదే క్రమశిక్షణతో బాగా పనిచేస్తే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది” అని సీఎం స్పష్టం చేశారు.
డాక్టర్ లాగా బాధితుల సమస్య వినండి
సామాన్యుడి నుంచి పెద్దవారి వరకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకొచ్చేది పోలీస్ స్టేషనేనని, అలాంటి వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “డాక్టర్ టెస్టులు చేసి రోగాన్ని సరిగ్గా గుర్తించినట్లే.. మీరు కూడా మీ దగ్గరకు వచ్చే బాధితుల సమస్యను ఓపికగా వినండి. మీకు అది సాధారణ విషయంలా అనిపించవచ్చు కానీ, బాధితుడికి అది జీవిత సమస్య కావచ్చు. సమస్యను అర్థం చేసుకుంటే పరిష్కారం లేనిది ఏదీ ఉండదు. ఐదు నిమిషాల సమయాన్ని అదనంగా కేటాయించి సమస్య వింటే ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది” అని సూచించారు. నిన్నటి వరకు సామాన్యులుగా ఉన్న అధికారులు, నేటి నుంచి ప్రత్యేక గుర్తింపు పొందారని.. అధికారాన్ని ప్రజల ప్రయోజనాల కోసం వాడితేనే గౌరవం నిలుస్తుందని, వ్యక్తిగత ప్రయోజనాలకు వాడితే ఉనికి లేకుండా పోతుందని హెచ్చరించారు.
సైబర్ నేరాలు, డ్రగ్స్ సవాల్.. ఈగల్ ఫోర్స్ సంచలనం
ఒకప్పుడు దొంగతనాలు, దొంగ సారాయి మాత్రమే సవాలుగా ఉండేవి కానీ, నేడు సైబర్ క్రైమ్స్, కొకైన్, డ్రగ్స్ వంటి అంశాలు నేరస్థులు విసురుతున్న పెద్ద సవాలుగా మారాయని సీఎం పేర్కొన్నారు. “డ్రగ్స్ బారిన పడి పంజాబ్ రాష్ట్రంలో 60 శాతం మంది నిర్వీర్యమయ్యారు. హైదరాబాద్లో కూడా ఈ సమస్య పెరుగుతుండటంతో మేం రాగానే ‘ఈగల్ ఫోర్స్’ (Eagle Force) ను ఏర్పాటు చేశాం. ఇక్కడ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ దొరికితే మాత్రం అంతే సంగతులు” అని తీవ్రంగా హెచ్చరించారు.
ట్రాఫిక్ మేనేజ్మెంట్, స్పెషల్ ట్రైనింగ్
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమై కొత్త కంపెనీలు రాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని గుర్తుచేశారు. హైదరాబాద్లో అలాంటి పరిస్థితి రాకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సైబర్ క్రైమ్, ఫుడ్ సేఫ్టీ వంటి విభాగాల్లో ఆసక్తి ఉన్న అధికారులకు విదేశాల్లో సైతం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని, నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖను ఆధునికీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

