CM Revanth Reddy : హైదరాబాద్ తూర్పు ప్రాంత రూపురేఖలను మార్చేలా ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొత్తం 1,511 కోట్ల రూపాయల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో వేలాదిగా తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి సీఎం భావోద్వేగ ప్రసంగం చేశారు. తన ప్రతి సభలోనూ ఆడబిడ్డలకు ముందు వరుసలో కూర్చునే అవకాశం కల్పించాలని అధికారులకు సూచించిన ఆయన, మహిళల ఆశీస్సుల బలంతోనే తాను జడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని కృతజ్ఞతలు చాటుకున్నారు.
మల్కాజ్‌గిరి నా రాజకీయ పునర్జన్మ
గతంలో కొడంగల్ నియోజకవర్గంలో తాను ఓటమి చెంది, రాజకీయంగా తీవ్ర ఎదురుదెబ్బ తిన్న తరుణంలో మల్కాజ్‌గిరి ప్రజలు ఎంపీగా గెలిపించి తనను ఆశీర్వదించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఐదేళ్లు తిరిగినా పూర్తికానంత పెద్దదైన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఒక ‘మినీ భారతదేశం’ లాంటిదన్నారు. కిందపడిపోయిన తనకు ఇక్కడి ఆడబిడ్డలు ఒక్క పైసా ఆశించకుండా ఓట్లు వేసి గెలిపించారని, ఆ ఎంపీ పదవి వల్లే సోనియా గాంధీ తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి, తాను ముఖ్యమంత్రి కావడానికి మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లే ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని, కాలం గిర్రున తిరిగి ఇప్పుడు సీఎం బాధ్యతలు చేపట్టడంతో ఆ లోటును భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు.
రూ.1,511 కోట్లతో రికార్డు స్థాయి మౌలిక వసతులు
ఈ పర్యటనలో భాగంగా నగర ప్రయాణ సౌకర్యాలను, వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో 98 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏఓసి (AOC) సెంటర్ చుట్టూ 960 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
వాహనదారుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు టీకేఆర్ కాలేజ్ జంక్షన్ నుండి మందమల్లమ్మ జంక్షన్ వరకు 416 కోట్ల రూపాయలతో నిర్మించే 6 లేన్ల ఫ్లై ఓవర్ పనులను ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో 37.50 కోట్ల రూపాయలతో ఉప్పల్‌లో నిర్మించనున్న 100 పడకల మల్కాజ్‌గిరి జిల్లా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. దీనితో పాటు ప్రజలకు వైద్య సేవలను మరింత సులభతరం చేసేందుకు ‘క్యూర్ వన్’ (Cure One) అనే సరికొత్త మొబైల్ యాప్‌ను సీఎం ఆవిష్కరించారు.
పాలనా వికేంద్రీకరణ – ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్
హైదరాబాద్ నగరంలో గతంలో నాలుగు రకాల పరిపాలన సాగేదని, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఆశించిన అభివృద్ధి జరగలేదని సీఎం విమర్శించారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోటి 30 లక్షల మంది జనాభా నివసిస్తున్నారని, వారికి అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ‘తెలంగాణ రైజింగ్ 2047’ పేరుతో ఒక క్రమబద్ధమైన విజన్ డాక్యుమెంట్‌ను తీసుకువచ్చామని ప్రకటించారు. దీనిలో భాగంగానే పంపిణీ , పరిపాలనా సౌలభ్యం కోసం క్యూర్ (CURE) ప్రాంతాన్ని ఏర్పాటు చేసి, మూడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశామన్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ స్వార్థం లేదని, కేవలం పాలనా వికేంద్రీకరణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇకపై పోలీస్ , మున్సిపల్ శాఖల పరిధులు ఒకేలా ఉండేలా సమన్వయం చేశామని తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడుకుందామని, మిగిలిన సమయంలో అభివృద్ధికి అందరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ప్రగతి కోసం రాజకీయాధికారాలు అడ్డురావని చెప్తూ.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ, ఉప్పల్ ప్రాంతానికి 40 ఏళ్ల పాటు సేవలందించిన ఆయన సోదరుడు దివంగత బండారు రాజిరెడ్డి జ్ఞాపకార్థం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు ‘బండారు రాజిరెడ్డి కారిడార్’గా పేరు పెడుతున్నట్లు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. రోడ్లు, చెరువుల సుందరీకరణ, మెట్రో విస్తరణ ఇలా ఉప్పల్ ప్రాంతానికి ఏం కావాలన్నా నిధులు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు.
మూసీ ప్రక్షాళనతో యువతకు ఉపాధి
గుజరాత్‌లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యమునా నదుల తరహాలో హైదరాబాద్‌లో మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయకూడదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు ఉన్న 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తియితే నగర పర్యాటక రంగం పుంజుకోవడమే కాకుండా, స్థానిక యువతకు వేలాదిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

