NTV Telugu Site icon

Revanth Reddy: మోడీ మోసానికి.. కేసీఆర్ దోఖాకు సమాధానం ఇస్తాం

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికలతో తాము మోడీ చేస్తున్న మోసానికి, కేసీఆర్ దోఖాకు గట్టి సమాధానం ఇవ్వబోతున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మహిళ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‭ను వంద మీటర్ల గోతిలో పాతిపెట్టే అవకాశం వచ్చిందని, ప్రజల్ని మోసం చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలు తీసుకునే నిర్ణయమే.. రాష్ట్ర భవిష్యత్‭ను మారుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు మునుగోడులో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్‭ను చంపాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడని మండిపడ్డారు.

మహిళా గర్జన సభకు తరలివచ్చిన ఆడబిడ్డలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి.. ఆడబిడ్డలంతా తరలివచ్చి, తమ ఆత్మ గౌరవాన్ని చాటారన్నారు. ఆడబిడ్డలకు పదవులిచ్చి గౌరవించింది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. డబుల్ బెడ్రూం, రైతు రుణమాఫీ, దళితులకు భూమి ఇవ్వని కేసీఆర్.. ఓటు ఎలా అడుగుతున్నాడని ప్రశ్నించారు. ధరలు పెంచి, సామాన్యుడి నడ్డి విరిచి.. ఇప్పుడు అభివృద్ధి పేరుతో బీజేపీ నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని ఆగ్రహించారు. మీ ఆడబిడ్డను మీ చేతుల్లో పెడుతున్నామని.. పాల్వాయి స్రవంతిని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. పాల్వాయి స్రవంతిని గెలిపిస్తే.. మునుగోడులోని ప్రతి సమస్యని పరిష్కరించడంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు కూడా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ పాలన ఫాంహౌస్‌కే పరిమితమైందని.. బీజేపీ అరాచకాలకు ఆ పార్టీ 8 ఏళ్లు వంతపాడిందని అన్నారు. పథకాల మాటున అడ్డు అదుపు లేని దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రైతు రుణమాఫీ హామీ అమలు కాలేదని, అన్నదాతల ఆత్మహత్యల పరంపర ఆగడం లేదని చెప్పారు. ఉచిత ఎరువుల హామీ కాకి ఎత్తుకెళ్తే.. నిరుద్యోగులకు భృతి ఓ భ్రమగా మిగిలిపోయిందన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉందన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతోందని వెల్లడించారు.