CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది

  • స్వగ్రామంలో దసరా వేడుకలు జరుపుకున్న సీఎం
  • తన ఊరు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్న రేవంత్ రెడ్డి
  • ప్రజలతో కలిసి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్య
  • తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష
Cm Revanth

Cm Revanth

విజయదశమి పర్వదినం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన దసరా వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. పండుగ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ రావణ దహనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

నాకు కొండంత స్ఫూర్తినిచ్చిన నేల కొండారెడ్డిపల్లి: సీఎం రేవంత్  

సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు జరుపుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆత్మీయ సందేశాన్ని పంచుకున్నారు. “ఒక సామాన్యుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమంలో నాకు కొండంత స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇచ్చిన శక్తివంతమైన నేల నా స్వగ్రామం కొండారెడ్డిపల్లి. మనకు జన్మనిచ్చిన గడ్డపైనే ఊరి ప్రజలతో కలిసి దసరా పండుగ జరుపుకోవడం వర్ణించలేని సంతోషాన్ని ఇచ్చింది” అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి..

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని సీఎం రేవంత్ రెడ్డి కాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండేలా తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ అందించాలని కొండారెడ్డిపల్లి ఆంజనేయస్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. సొంత ఊరిలో దసరా వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన సీఎంకు గ్రామస్తులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.