CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నిసార్లు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్‌కు రావడం, గత రెండేళ్ల తమ పాలనపై ప్రజల నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్‌కు 38 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు రావడం, నగర రాజకీయ దిశను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ధోరణి కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో పెద్దగా ఫలితాలు రాలేదని గుర్తుచేసిన సీఎం, ఇప్పుడు ప్రజలు తమ పనితీరును పరిశీలించి తీర్పు ఇచ్చారని చెప్పారు. నగరంలోని అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని, అయితే బీఆర్‌ఎస్ మాత్రం తప్పుడు ప్రచారానికి తెగబడుతోందని విమర్శించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి నగరాభివృద్ధికి కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.
డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ఫోర్స్, కబ్జాల నివారణకు హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చామని తెలిపారు. ప్రజల కోసం ప్రారంభించిన ఈ చర్యలపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల ఎన్నికల్లో కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లు గతంతో పోల్చితే 25 శాతానికి పడిపోవడం “భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనలా” ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తన తీరు మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సచివాలయానికి రావాలని కిషన్ రెడ్డిని ఆహ్వానించారు. కేంద్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కకు సూచించారు.
Bhumana Karunakar Reddy: సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!
